అధికార దుర్వినియోగం, న్యాయవ్యవస్థ కార్యకలాపాలు అడ్డుకోవడం వంటి ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గంపై విచారణకు సిద్ధమయ్యారు డెమొక్రాట్లు. ప్రతిపక్షానికి ఆధిక్యమున్న దిగువసభలోని న్యాయ వ్యవహారాల కమిటీ ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది.
ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, వేర్వేరు పత్రాలు సమర్పించాలని ఆదేశిస్తూ హౌస్ కమిటీ 81మందికి లేఖలు రాసింది. ట్రంప్ సహా ఆయన ప్రభుత్వం ఏమైనా అక్రమాలకు పాల్పడిందా అన్న విషయాన్ని బయటపెట్టే సమాచారం ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది.
కఠినపదజాలంతో హౌస్ కమిటీ రాసిన లేఖలు అందుకున్నవారిలో ట్రంప్ కుటుంబసభ్యులు, రాజకీయ సన్నిహితులు, వేర్వేరు సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ట్రంప్ కుమారులు డాన్ జూనియర్, ఎరిక్, అల్లుడు జారెడ్ కుష్నర్కు లేఖలు రాసింది కమిటీ. శ్వేతసౌధంలో సీనియర్ సలహాదారైన ట్రంప్ కుమార్తె ఇవాంక ఈ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది.