అభిశంసన వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మరిన్ని చిక్కులు చుట్టుముడుతున్నాయి. అధికార దుర్వినియోగానికి సంబంధించిన మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యర్థులు(డెమొక్రటిక్ నేత, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, ఆయన కుమారుడు, ఇతరుల)ను ఇరుకున పెట్టేందుకు ఉక్రెయిన్ సహకరించే వరకు ఆ దేశానికి ఆర్థిక సాయం నిలిపివేయాలని జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌తో ట్రంప్ అన్నట్లు తెలిసింది. బోల్టన్ స్వయంగా రాసిన ఓ పుస్తకంలో ఈ విషయం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది.
ఉక్రెయిన్‌లోని ఓ గ్యాస్ కంపెనీతో బిడెన్ కుటుంబానికి సంబంధం ఉంది. ఆ సంస్థకు చెందిన వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశించేలా ఉక్రెయిన్ ప్రభుత్వంపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారన్నది ప్రధాన ఆరోపణ.
సరికొత్త అస్త్రం...
అధికార దుర్వినియోగం ఆరోపణలతో ట్రంప్‌ను అభిశంసించడంపై అమెరికా ఎగువ సభలో విచారణ జరుగుతోంది. నేటి నుంచి ట్రంప్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఇలాంటి సమయంలో జాన్ బోల్టన్ పుస్తకంలోని అంశాలు ప్రతిపక్షానికి సరికొత్త అస్త్రాలుగా మారాయి. బోల్టన్‌ను సాక్షిగా సభకు పిలిచి, సమగ్ర విచారణ జరిపించాలని డెమొక్రటిక్ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు.
జాన్ బోల్టన్ గతేడాది సెప్టెంబర్ 10న జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి వైదొలిగారు. ఆ మరుసటి రోజే ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం విడుదల చేసింది ట్రంప్ సర్కార్. శ్వేతసౌధం అధికారులు ఎవరూ అభిశంసన విచారణలో పాల్గొనరాదని ట్రంప్ ఆదేశించినా... తాను వచ్చి సాక్ష్యం చెబుతానని ఇప్పటికే ప్రకటించారు బోల్టన్.
సేల్స్ కోసమే....
జాన్ బోల్టన్ పుస్తకంలో ఉన్నట్లు చెబుతున్న విషయాల్ని ట్రంప్ ఖండించారు. ఉక్రెయిన్‌కు సాయం నిలిపివేతపై బోల్టన్‌తో తాను ఏమీ చెప్పలేదని స్పష్టంచేశారు. ఒకవేళ అలా చెప్పినట్లు ఏమైనా ఉంటే... అవన్నీ పుస్తకాల విక్రయాలు పెంచుకునేందుకు రాసినవే అని విమర్శించారు ట్రంప్.
ఇదీ చూడండి: 11 లక్షల మందిని చంపేసింది ఇక్కడే....