టీకా ద్వారా లభించే యాంటీబాడీల నుంచి డెల్టా వేరియంట్ తప్పించుకోలేదని ఓ అధ్యయనం వెల్లడించింది. అందువల్లే వ్యాక్సిన్ తీసుకున్న ప్రజల్లో ఎక్కువ శాతం డెల్టా బారిన పడటం లేదని వివరించింది. ఈ మేరకు అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు జరిపిన అధ్యయన ఫలితాలు ఇమ్యూనిటీ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
వాటితో పోలిస్తే డెల్టా ప్రమాదకరం కాదా?
ఫైజర్ టీకా తీసుకున్నవారి నుంచి సేకరించిన ప్రతిరక్షకాలపై ఈ అధ్యయనం జరిగింది. వాటిలో ఒక్కటి మినహా మరే ఇతర యాంటీబాడీల నుంచి డెల్టా తప్పించుకోలేకపోయిందని పరిశోధకులు తెలిపారు. అయితే.. వాటిలోని చాలా ప్రతిరక్షకాలు మాత్రం బీటా లాంటి వేరియంట్లను గుర్తించలేకపోయాయని, వాటిని నాశనం చేయలేకపోయాయని వెల్లడించారు. కాబట్టి, డెల్టా ఉద్ధృతి మిగతా వేరియంట్ల కన్నా అధికంగా ఉన్నా.. యాంటీబాడీలను అడ్డుకోవడంలోనూ దానిదే పైచేయి అని నిర్ధరించలేమని వివరించారు.
రక్షణ కల్పించడంలో యాంటీబాడీల పొడవుతో పాటు వెడల్పు కూడా కీలకమేనని అధ్యయనకర్తలు చెప్పారు. కొత్త వేరియంట్‌ను కొన్ని గుర్తించలేకపోయినా.. మిగిలిన ప్రతిరక్షకాలకు వాటిని తటస్థీకరించే సామర్థ్యం ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: 'టీకా ధ్రువపత్రం ఉంటేనే రెస్టారెంట్లోకి ఎంట్రీ'