Corona deer canada: ప్రపంచవ్యాప్తంగా మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి.. వన్యప్రాణులకు కూడా ప్రమాదకరంగా మారుతోందా? తాజాగా.. కెనడాలో మూడు జింకలకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ కావడం ఈ ప్రశ్నను రేకెత్తిస్తోంది. అటవీ జంతువులకు కరోనా సోకడం ఆ దేశంలో ఇదే తొలిసారి. ఈ మేరకు కెనడా వాతావరణ, పర్యావరణ మార్పుల విభాగం తెలిపింది.
మూడు జింకల్లో సార్స్-కొవ్-2 వైరస్ నిర్ధరణ అయినట్లు కెనడా నేషనల్ సెంటర్ ఫర్ ఫారిన్ యానిమల్ డిసీజ్ సంస్థ సోమవారం తెలిపింది. క్యూబెక్లోని ఎస్టైర్ ప్రాంతంలో నవంబరు 6 నుంచి 8 మధ్య ఈ నమూనాలను సేకరించినట్లు తెలిపింది. అయితే.. అమెరికాలో లాగే కెనడాలోనూ జింకల్లో ఎలాంటి వ్యాధి లక్షణాలు బయటపడలేదని ద వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ బుధవారం తెలిపింది. ఆ మూడు జింకలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పింది.
కెనడాలో వన్యప్రాణుల్లో కరోనా నిర్ధరణ కావడం ఇదే తొలిసారి అయినందన ఇతర జింకలకు వ్యాప్తి, ప్రభావంపై సమాచారం లేదు అని కెనడా వాతావరణ, పర్యావరణ మార్పుల సంస్థ తెలిపింది. అటవీ జంతువుల్లో కరోనా వ్యాప్తిపై నిఘా ఉంచాల్సిన అవసరాన్ని ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోందని చెప్పింది. దీన్ని ఎదుర్కోవడానికి తగిన ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మింక్, పిల్లులు, కుక్కలు, ఫెర్రెట్స్ సహా జంతుప్రదర్శనశాలలోని పలు జంతువులకు కరోనా సోకినట్లు తేలింది.
ఇవీ చూడండి: