అమెరికాలో ఈ మధ్య కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటి వాటిపై సమాచారం అందిన నిమిషాల్లో అక్కడి పోలీసులు స్పందిస్తుంటారు. అయితే టెక్సాస్‌లో జరిగిన ఓ ఘటన పోలీసులకు వింత అనుభవాన్నిచ్చింది.
'ఇంట్లో దొంగ దూరాడు.. నా ఆయుధాన్ని వంటింట్లోనే మర్చిపోయాను' అంటూ ఓ మహిళ భయంతో టెక్సాస్‌లోని పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. వెనువెంటనే అప్రమత్తమైన అధికారులు క్షణాల్లో తుపాకులతో ఆ మహిళ ఇంటిని చుట్టుముట్టారు.
దొంగను బయటకు రావాలంటూ హెచ్చరించారు. ఎంతసేపటికి రాకపోవడం వల్ల నెమ్మదిగా ఇంట్లో ప్రవేశించారు. ఇల్లు అంతా చిందరవందరగా ఉంది. తుపాకులను ఎక్కుపెట్టి పోలీసులు నిశితంగా ప్రతి అంగుళం పరిశీలించారు.
దొంగ కోసం చూసిన పోలీసులకు... అక్కడ ఓ జింక కంటపడింది. ఎక్కడి నుంచో ఇంట్లోకి ప్రవేశించిన ఆ లేడి.. బయటకు వెళ్లే దారి తెలియక అటు ఇటూ తికమకగా తిరుగుతోంది. ఇంకేముంది.. ఆశ్చర్యంతో నిల్చొన్న పోలీసులు జింకకు దారిచ్చి వెనుదిరిగారు.
ఈ మొత్తం ఘటన అధికారుల బాడీ కెమెరాలో రికార్డయింది.
ఇదీ చూడండి: అంతరిక్షంలోకి పర్యటకులు.. నాసా కొత్త ఆలోచన