అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి నువ్వా-నేనా అన్నట్లు జరిగింది. ఉపాధ్యక్ష అభ్యర్థులు మైక్ పెన్స్, కమలా హారిస్ సంవాదం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. కరోనా మహమ్మారిని నిలువరించడంలో ట్రంప్ సర్కారు పూర్తిగా విఫలమైందని హారిస్ ఆరోపించారు. ఇది అమెరికా చరిత్రలోనే ఘోర వైఫల్యంగా అభివర్ణించారు. లక్షలాది అమెరికన్ల చావుకు ప్రభుత్వ అలసత్వమే కారణమని ఆరోపించారు కమల.
''కరోనా వైరస్‌పై ట్రంప్, పెన్స్‌కు జనవరిలోనే సమాచారం అందింది. ముందస్తు సమాచారం ఉన్నా ట్రంప్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఇది అమెరికా పరిపాలన చరిత్రలోనే ఘోర వైఫల్యం.
ట్రంప్ కేవలం 750 డాలర్లే ఆదాయ పన్నుగా చెల్లించడంలో లొసుగులు ఉన్నాయి. పన్ను విషయాన్ని దాచాల్సిన అవసరం ఏంటి? అధ్యక్షుడు చెల్లించే పన్నును ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.''
- కమలా హారిస్, డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి
అంతకుముందు కొవిడ్ నియంత్రణలో ట్రంప్ సర్కార్ సమర్థంగా పనిచేస్తోందన్నారు ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి మైక్ పెన్స్.
''కరోనా కట్టడిలో ట్రంప్ ప్రభుత్వం సమర్థంగా పనిచేసింది. కొవిడ్ వైరస్ వ్యాప్తికి చైనానే కారణం. ట్రంప్ చర్యల వల్లే వేలాది అమెరికన్లకు ప్రాణాపాయం తప్పింది. చైనా ప్రయాణాలపై నిషేధం విధించి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివర్లోగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. కరోనాపై 5 కంపెనీల ప్రయోగాలు మూడో స్టేజీలో ఉన్నాయి.''
- మైక్ పెన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు
హారిస్ మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్నారు మైక్ పెన్స్. అయితే మాట్లాడేటప్పుడు అడ్డుపడొద్దని కమల గట్టిగా బదులిచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉపాధ్యక్ష అభ్యర్థుల సంవాదం ఆ వేడిని మరింత పెంచింది.