ఇడా హరికేన్(Ida Hurricane) ప్రభావంతో అమెరికాలోని న్యూయార్క్‌తోపాటు న్యూజెర్సీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ధాటికి పలు సంఘటనల్లో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో న్యూజెర్సీకి చెందిన వారు 26 మంది కాగా.. న్యూయార్క్‌లో 13 మంది మృతి చెందారు. కొన్నిచోట్ల ప్రజా రవాణాను నిలిపివేశారు. న్యూయార్క్‌లోని జాతీయ వాతావరణ సేవలకేంద్రం వరద ఉద్ధృతి దృష్ట్యా మొట్టమొదటిసారిగా అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో ఓ జలాశయంలోకి ప్రమాదకరస్థాయిలో నీరు చేరడంతో స్థానికులను ఖాళీ చేయించారు. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వరదల కారణంగా పలు చోట్ల రహదారుల జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కార్లు, వాహనాలు నీట మునిగాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నీటిలో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు ల్యారీ తుపాను అంతకంతకూ బలపడుతోందని, శనివారం కల్లా అది ఇడా స్థాయిలో తీవ్రరూపు దాల్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: C.1.2 virus: కొత్త వేరియంట్‌తో ప్రమాదమా- శాస్త్రవేత్తల మాటేంటి?