అమెరికాలో కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కార్చిచ్చు విధ్వంసం కొనసాగుతోంది. మంటల తాకిడికి ఇప్పటివరకు 31 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పలువురి ఆచూకీ గల్లంతయింది. ఒరెగాన్‌లో 8 మంది చనిపోయారు. వాషింగ్టన్లో ఓ ఏడాది చిన్నారి మంటల్లో చిక్కుకొని మరణించింది. కాలిఫోర్నియాలో 19 మంది అగ్నికి ఆహుతయ్యారు. తగిన సమయంలో అధికారులు హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
అటవీ ప్రాంతాల్లో మూగజీవులు ఎటూవెళ్లలేక మంటల్లో చిక్కుకొని చనిపోతున్నాయి. మరోవైపు కార్చిచ్చును అదుపు చేయడానికి 16 వేలమందికిపైగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 30 లక్షల ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం దహనమైంది. 4 వేల నిర్మాణాలు దగ్ధమయ్యాయి.
కాలిఫోర్నియాకు ఉత్తర ప్రాంతంలో ఎన్నడూలేని విధంగా దావానలం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాలిఫోర్నియా వెళ్లనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: ఫ్రాన్స్‌లో మళ్లీ ఎల్లో వెస్ట్ నిరసనలు