ETV Bharat / international

వాతావరణ మార్పులతో ముసురుతున్న ముప్పు!

వాతావరణ మార్పులతో అంటువ్యాధుల వ్యాప్తి తీవ్రమవుతోందని అమెరికాలోని ఓ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 27-32 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం 25-45 మధ్య ఉన్న ప్రాంతాల్లోనే కొవిడ్‌ ఎక్కువగా కేంద్రీకృతమవుతున్నట్లు ఈ అధ్యయనం తేల్చింది.

Covid threat looming with climate change, Study
వాతావరణ మార్పులతో ముసురుతున్న కొవిడ్ ముప్పు
author img

By

Published : Apr 27, 2021, 8:25 AM IST

నానాటికీ పెరుగుతున్న భూతాపం తాలూకు దుష్ఫలితాలు-వాతావరణ మార్పులు, సముద్ర మట్టాలు పెరగడం, కరవు కాటకాలకే పరిమితం కాదు. అంటువ్యాధులు, విషజ్వరాల వ్యాప్తికీ ఇది కారణమవుతోంది. అడ్వాన్సింగ్‌ ఎర్త్‌ అండ్‌ స్పేస్‌సైన్స్‌ సంస్థ ప్రచురించే 'జియో హెల్త్‌' జర్నల్‌ డిసెంబరు 2020 సంచిక కొవిడ్‌ వ్యాప్తికి దారితీస్తున్న వాతావరణ మార్పులను సవివరంగా చర్చించింది. 27-32 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం 25-45 మధ్య ఉన్న ప్రాంతాల్లోనే కొవిడ్‌ ఎక్కువగా కేంద్రీకృతమవుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న దక్షిణాసియా ప్రాంతానికి అతితీవ్ర ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉందనీ వెల్లడించింది. కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్న ప్రాంతాలే కొవిడ్‌ విజృంభణకు కేంద్రబిందువులుగా మారుతున్నాయని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది. అధిక కర్బన ఉద్గారాలు కలిగిన ప్రాంతాలే కాదు- అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాలైన ముంబయి, దిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, చెన్నైల్లో వైరస్‌ల వ్యాప్తికి అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాల అప్రమత్తత తక్షణావసరం. జనసమ్మర్ద ప్రాంతాల్లో కరోనా వైరస్‌ ప్రభావ తీవ్రత, మరణాల రేటు ఎక్కువగా ఉండి ప్రజారోగ్య వ్యవస్థపై ఒత్తిడి తీవ్రతరమవుతుంది. మొదట్లో కొవిడ్‌ కేసుల వ్యాప్తి-విస్తరణ సున్నా నుంచి పది డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఉన్న దేశాలు, నగరాలకు పరిమితమైంది. తరవాత బ్రెజిల్‌, పెరూ, సింగపూర్‌ వంటి ఉష్ణమండల దేశాలకు ఎగబాకింది. భారతదేశంలో ఈ వైరస్‌ ధాటికి మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తమిళనాడులతో సహా రెండు తెలుగు రాష్ట్రాలు విలవిలాడుతున్నాయి.

వాతావరణ మార్పులతో వ్యాధులు విస్తరిస్తుండటం నాణేనికి ఒకవైపు. మరోవైపు- కొవిడ్‌ ప్రభావంతో పర్యావరణానికి హానికారకమైన ప్లాస్టిక్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. గ్లౌజులు, మాస్కులు గుట్టలుగా పోగుపడుతున్నాయి. ఆసుపత్రుల నుంచీ ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు వెలువడుతున్నాయి. దుకాణ సముదాయాలు, కార్యాలయాల్లో భౌతిక దూరాన్ని పాటించేందుకు ఏర్పాటు చేసుకుంటున్న ప్లాస్టిక్‌ తెరలు, వాడిపారేసే సంచుల వాడకం పెరగడమూ పుడమితల్లి పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా మేటవేస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలకు ఇవి తోడు కావడం- పర్యావరణంపై పెనుప్రభావం చూపనుంది. కొవిడ్‌ కాలంలో ప్రజలు ఉద్యోగాలు, ఇతర దైనందిన అవసరాల కోసం ప్రజారవాణాకు బదులు సొంత వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థల్లో భౌతిక దూరాన్ని పాటించడం కష్టమన్న అభిప్రాయంతో ఇలా చేస్తున్నారు. దీనితో ట్రాఫిక్‌ రద్దీ పెరగడమే కాకుండా వాయుకాలుష్యం, హరిత గృహవాయు ఉద్గారాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు గణనీయంగా తగ్గడం వల్ల కర్బన, నత్రజని ఉద్గారాలు తగ్గడం కొద్దిమేరకు ఊరట కలిగించే విషయమే. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న మొత్తం కర్బన ఉద్గారాల్లో 23 శాతం రవాణా రంగం నుంచైతే అందులో 11 శాతం వాటా విమానాలదే. లాక్‌డౌన్‌లు, క్వారంటైన్‌ల మూలంగా ప్రజలందరూ ఎక్కువ శాతం ఇంటిపట్టునే గడపాల్సి రావడం కూడా పర్యావరణానికి కొంత మేలే జరిగింది. ప్రకృతి పట్ల అవగాహన పెరగడం, దాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలకు అర్థం కావడం తదితరాలూ సానుకూలాంశాలే. మరోవైపు, వివిధ ఆంక్షల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన శాస్త్ర, సాంకేతిక పరిశోధనల ప్రగతి మందగించింది. ముఖ్యంగా 2020లో జరగాల్సిన 'కాప్‌-26' ప్రపంచ వాతావరణ మార్పుల సదస్సు సైతం వాయిదా పడింది.

బ్రిటన్‌, అమెరికా, జర్మనీలకు చెందిన శాస్త్రవేత్తల బృందమూ కొవిడ్‌ వ్యాప్తికి, వాతావరణ మార్పులకు ప్రత్యక్ష సంబంధం ఉందని తేల్చిచెప్పింది. భూమి మీద పెరుగుతున్న వాతావరణ మార్పులకు సమాంతరంగా విష జ్వరాలు, అంటువ్యాధలు విజృంభిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా వ్యాధుల విస్తరణను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. తక్షణం ఈ దిశగా కృషి ప్రారంభించకపోతే ఆరోగ్య వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. మహమ్మారుల బారిన పడిన ప్రజలకు వైద్య-ఆరోగ్య సదుపాయాల కల్పన ప్రశ్నార్థకంగా మారి, ఆరోగ్య ఆత్యయిక పరిస్థితులకూ దారి తీయవచ్చు. పొంచి ఉన్న ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలనుకుంటే వాతావరణ మార్పులను కట్టడిచేయాలి. ఇందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి. ప్యారిస్‌ ఒప్పందం ప్రధాన లక్ష్యమైన భూ ఉష్ణోగ్రతల్లో వృద్ధి రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చూడటం ద్వారానే వాతావరణ మార్పుల ద్వారా కలిగే దుష్పరిణామాలను నియంత్రించగల వీలుంది.

- డాక్టర్‌ జి.వి.ఎల్‌.విజయ్‌కుమార్‌, భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.