కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాత్రి- పగలు తేడా లేకుండా తమ మేథోసంపత్తిని వ్యాక్సిన్‌ను రూపొందించడం కోసం నిరంతరం ఉపయోగిస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. అయితే కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేసి.. ప్రజలకు అందించినప్పటికీ ఎలాంటి లాభం లేదని ప్రముఖ వార్తా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. వైరస్ మరికొన్నేళ్లు ఇలాగే ఉంటుందని పేర్కొంది. హెచ్ఐవీ, మీసిల్స్, చికెన్ పాక్స్ లాగే భూమిపై ఉండిపోవచ్చని వెల్లడించింది.
కరోనాతో సహజీవనం చేయకతప్పదన్న విషయాన్ని అమెరికా గుర్తించి.. వైరస్‌పై పోరుకు ప్రణాళికలు రచించాలని అగ్రరాజ్యానికి చెందిన ఎపిడమాలజీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్నో అనిశ్చితులున్నప్పటికీ.. కరోనాతో కలిసి జీవించడం మాత్రం స్పష్టంగా కనపడుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి వైరస్ సోకలేదని, వారందరూ ప్రమాదంలో ఉన్నట్లేనని వెల్లడించారు.
'వైరస్ ఉండటానికే ఇక్కడకి వచ్చింది. కానీ దానితో సహజీవనం చేస్తూ మనం భద్రంగా ఉండటం ఎలాగా అనేదే అసలైన ప్రశ్న' అని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎపిడమాలజిస్ట్ సారా కోబే అభిప్రాయపడ్డారు.
అయితే కరోనా వైరస్ ప్రతాపం తగ్గుముఖం పట్టొచ్చని పలువురు నిపుణులు విశ్వసిస్తున్నారు. మనిషి రోగ నిరోధక శక్తి.. వైరస్‌కు అలవాటు పడుతుందన్నారు. కానీ దీనికి చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసిన అనంతరం దాని పంపిణీ ఎంతో క్లిష్టమని మరికొందరు తెలిపారు. తొలినాళ్లలో.. వైరస్ సోకిన జనాభాకు సరిపడా వ్యాక్సిన్ డోసులు తయారు చేయడం అంత సులభం కాదన్నారు. అంతర్జాతీయ సమాజం మధ్య సహకారం లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయన్నారు.
ఈ సంక్షోభం వల్ల ప్రజల్లో పెద్దగా మార్పులు రావని మిన్నిసొట విశ్వవిద్యాలయంలోని మైఖెల్ టీ ఓస్టర్‌హోమ్ వెల్లడించారు.
"ఇంత జరిగినా ప్రజలు దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకోరు. తమకో, తమ సన్నిహితులకో వైరస్ సోకితే తప్ప ప్రజలు మారరు. ఈ పరిస్థితి అతివేగంతో డ్రైవింగ్ చేయడం లాంటిది. దారి మధ్యలో ఏదైనా రోడ్డు ప్రమాద ఘటన కనపడితే.. మన వాహన వేగం కొంత సమయం నెమ్మదిస్తుంది. ఆ తర్వాత తిరిగి పాత కథే. అదే వేగంతో మనం వాహనం నడుపుతాం."
--- మైఖెల్, మిన్నిపొటి విశ్వవిద్యాలయం