ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఆవిర్భవించి సంవత్సరం దాటినా.. చైనా మాత్రం ఇప్పటికీ మహమ్మారిపై దుష్ప్రచారం చేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. వైరస్ ఆవిర్భావంపై అధ్యయనం చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీకి.. డ్రాగన్ దేశం అడ్డుపడుతోందని విమర్శించారు. కరోనా వ్యాక్సిన్లపైనా చెడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చైనా ప్రభుత్వ చర్యల వల్ల చైనీయులే కాక ప్రపంచమంతా ఇబ్బందిలో పడుతుందన్నారు పాంపియో.
జనవరిలో వుహాన్‌కు..
కరోనా వైరస్ మూలాలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు జనవరి మొదటివారంలో వుహాన్‌కు తమ బృందం వెళ్లనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ తెలిపారు.
"మొట్టమొదటి కరోనా కేసు నమోదైన వుహాన్ నగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం పర్యటించనుంది. మహమ్మారి మూలాలపై సమగ్ర దర్యాప్తు చేయనుంది. స్థానిక చైనా నిపుణులతో కలిసి మా బృందం పనిచేయనుంది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావటం శుభసూచకం. కానీ రానున్న 3-6 నెలలు అప్రమత్తంగా ఉండాలి.''
--మైకేల్ ర్యాన్ , ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
అమెరికాలో ప్రస్తుతం కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ దేశంలో 1,74,42,100 కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 3లక్షలమందికి పైగా వైరస్‌తో మరణించారు.
ఇదీ చదవండి : ప్రపంచ దేశాలన్నింటికీ కరోనా టీకా అవసరమే