కరోనా మహమ్మారి మహిళల ఆదాయం, ఆరోగ్యం, భద్రతపై ప్రతికూల ప్రభావం చూపిందని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం(యూఎన్ వుమెన్) సహాయ ప్రధాన కార్యదర్శి అనితా భాటియా పేర్కొన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలపై పడిన ప్రభావం అసమానంగా ఉందని తెలిపారు. ప్రపంచదేశాలన్నీ కరోనా నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మహిళా కేంద్రీకృత విధానాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
కరోనాకు పూర్వం పురుషులతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా మహిళలు ఇంటి పని చేశారని, మహమ్మారి సమయంలో ఈ సంఖ్య మరింత పెరిగిందని తెలిపారు.
"మహమ్మారి వ్యాప్తికి ఏడాది దాటిన తరుణంలో మనం కొత్త సమస్యలను చూస్తున్నాం. మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో నిరుద్యోగం పెరిగింది. ఆర్థిక వ్యవస్థలన్నీ పునఃప్రారంభమైనప్పటికీ.. మునుపటి స్థాయిలో మహిళలు ఉద్యోగాలకు వెళ్లలేకపోతున్నారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా శ్రామిక శక్తిలో మహిళల వాటా తగ్గింది. ఇది ఇలాగే కొనసాగితే.. ఆర్థిక వ్యవస్థల ఉత్పాదకతపై ప్రభావం పడుతుంది. ఉత్పాదకత తగ్గితే జీడీపీ పడిపోతుంది."
-అనితా భాటియా, ఐరాస మహిళా విభాగ సహాయ ప్రధాన కార్యదర్శి
సంరక్షణ బాధ్యతలు మహిళలపై పడటం వల్ల కొత్త సమస్య తలెత్తుతోందని అన్నారు భాటియా. సంరక్షణ బాధ్యతల సమస్య ఒక్క కుటుంబానికే పరిమితం కాదని, ఇది ప్రభుత్వ విధానపరమైన సమస్య అని పేర్కొన్నారు. మహిళలకు ఆసరా కల్పించే విధంగా సామాజిక సంరక్షణ పథకాలు, చైల్డ్‌కేర్ సబ్సిడీలు, నగదు బదిలీ కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వాలకు సూచించారు. మహిళలకు అనువైన పనివేళలు ఉండేలా చూడాలని ప్రైవేటు సంస్థలను కోరారు.
ఇదీ చదవండి: భారత్‌లో 68 మిలియన్ టన్నుల ఆహారం వృథా