మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. కొవిడ్ సంబంధిత శాస్త్ర పరిశోధనల కోసం 250 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. పేద, మధ్య ఆదాయ దేశాల్లో కరోనా పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్ల కోసం ఈ నిధులు ఉపయోగపడుతాయని పేర్కొంది.
"2021లో ప్రపంచ పరిస్థితి మెరుగుపడుతుందని మాకు నమ్మకముంది. కానీ, ఇది అందరికీ అందుతుందా అనేది ప్రపంచ నాయకుల చర్యలు, వాళ్ల నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది. పరీక్షలు, చికిత్సలు, టీకాలు అందరికీ అందాలి. పేద, మధ్య ఆదాయ దేశాలకు ఈరోజు మేం చేసిన సాయం ఉపకరిస్తుంది."
-- మిలిందా గేట్స్, గేట్స్ ఫౌండేషన్ సహ అధ్యక్షురాలు
వివిధ దేశాల్లో టీకాను సరఫరా చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆ సంస్థ పేర్కొంది. 'మనదగ్గర సరిపడా మందులు, వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ.. అవి ప్రజలకు అందుబాటులోకి వస్తేనే వారి ప్రాణాలను కాపాడగలవు' అని అన్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.
కొవిడ్‌పై పోరులో సాయపడటానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలు ముందుకు రావాలని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ పిలుపునిచ్చింది. తాజా నిధులతో కలిపి కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి ఇప్పటి వరకు 1.75 బిలియన్ డాలర్లు విరాళాన్ని అందించింది ఆ సంస్థ.
ఇదీ చూడండి:కమల, ఫౌచీ పేర్లనే తప్పుగా పలికారు!