బర్త్ డే పార్టీల్లో గిఫ్ట్లు ఇవ్వడం సహజం. ఇక పెళ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొందరు ఉత్తి చేతులు ఊపుకుంటూ వస్తారు. ఇంకొందరు.. ఏదో ఇవ్వాలి కదా! అని చిన్న కానుకలు ఇస్తూ ఉంటారు. ఇక 'ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చి.. అంత తినివెళ్లారు' అన్న మాట తరచూ వినపడుతూనే ఉంటుంది. అయితే ఈ మాటలను ఓ జంట సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. తమ పెళ్లిలో ఇలా జరగకూడదని ఫిక్స్ అయినట్టుంది. తమ వివాహంలో ఎవరు ఎలాంటి కానుకలు ఇస్తే.. వారికి అందుకు తగ్గట్టుగానే భోజనాలు ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పింది. వివరాల్లోకి వెళితే...
ఇదీ జరిగింది..
ఓ జంట తమ పెళ్లికి హాజరయ్యే వారు తెచ్చే కానుకలను, ధరల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించింది. అతిథులు తెచ్చే కానుకలకు తగ్గట్టుగానే వారికి భోజనం పెడతామని ముందుగానే చెప్పేసింది. ఆ కేటగిరీలు ఇలా ఉన్నాయి..
లవింగ్ గిఫ్ట్- ఖరీదు 250 డాలర్ల వరకు ఉండాలి. ఇలాంటి గిఫ్ట్ తెచ్చినవారికి రోస్ట్ చికెన్ లేదా స్వార్డ్ ఫిష్ వడ్డిస్తారు.
సిల్వర్ గిఫ్ట్- ఖరీదు 251 డాలర్ల నుంచి 500 డాలర్ల మధ్య ఉంటే.. మొదటి కేటగిరీలోని ఆహారం లేదా స్లైస్డ్ స్టీక్, పోచ్డ్ సాల్మొన్ వడ్డిస్తారు.
గోల్డెన్ గిఫ్ట్- ఖరీదు 501 డాలర్ల నుంచి 1000 డాలర్ల మధ్య ఉండాలి. ఇలా కానుక ఇచ్చిన వారికి పైన రెండు కేటగిరిల్లోని భోజనం లేదా ఫైలెట్ మిగ్నాన్, లాబ్స్టర్ టేల్స్ ఇస్తారు.
ప్లాటినమ్ గిఫ్ట్- ఖరీదు 1000 డాలర్ల నుంచి 2500 డాలర్ల మధ్య ఉండాలి. పైన మూడు కేటగిరీల్లోని భోజనం లేదా లోబ్స్టర్ విత్ సావనీర్ షాంపైన్ గోబ్లెట్ ఉంటుంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ నాలుగు కేటగిరిల్లో కానుకలు తెచ్చిన వారికే భోజనం ఉంటుందని చెప్పడం నెటిజన్లను ఆశ్యర్యానికి గురిచేసింది. దీనిపై భిన్నంగా స్పందించారు నెటిజన్లు. ఆ జంటకు మతి పోయిందంటూ కామెంట్లు చేశారు.
ఇదీ చదవండి: కూతుళ్లను ఇంట్లోంచి గెంటేసి తల్లి నాలుగో పెళ్లి!