అమెరికాలోని అరిజోనా రాష్ట్రానికి చెందిన ఓ వృద్ధ జంటకు కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. ఫీనిక్స్ నగరానికి చెందిన ఈ జంట మెగా మిలియన్స్ జాక్పాట్లో 41 కోట్ల డాలర్ల (రూ.3127.5 కోట్లు)ను గెలుచుకున్నారు.
నగరంలోని సర్కిల్ కే లో ఈ వృద్ధ జంట లాటరీ కొనుగోలు చేసింది. జూన్ 9న తీసిన డ్రాలో వీరి టిక్కెట్లోని అన్ని నంబర్లు సరిపోలాయి. అయితే కుటుంబ సభ్యుల జన్మదిన తేదీలు సరిపోలేలా లాటరీ కొనుగోలు చేయటం వీరికి కలిసివచ్చిందని చెబుతున్నారు.
చేతికి రూ.1,737 కోట్లు..
లాటరీలో గెలుచుకున్న మొత్తంలో 31.99 కోట్ల డాలర్లు (రూ.2,440 కోట్లు) ఈ జంట స్వీకరించనుంది. ఫెడరల్ పన్నుల కింద 7.6 కోట్ల డాలర్లు, 1.53 కోట్ల డాలర్లు రాష్ట్ర పన్నులు పోనూ 22.78 కోట్ల డాలర్లు (రూ.1,737 కోట్లు) ఈ దంపతులకు అందుతాయి.
అప్పులు తీర్చి ఆపైన..
అరిజోనా రాష్ట్ర చట్టాల ప్రకారం వీరి పేర్లు వెల్లడించటం నిషేధం. అయితే వీరి వయస్సు 70, 63 ఏళ్లు అని లాటరీ అధికారులు తెలిపారు. ఈ డబ్బుతో తమ అప్పులు తీర్చుకుని, మిగతాది తమ పిల్లలకు, పెట్టుబడులకు వినియోగిస్తామని ఆ దంపతులు చెప్పినట్లు లాటరీ అధికారులు వెల్లడించారు.
మెగా మిలియన్స్ జాక్పాట్ 38 ఏళ్లుగా లాటరీ విక్రయాలు జరుపుతోంది. ఇప్పటివరకు ఈ సంస్థ అందించిన 11వ అతిపెద్ద లాటరీ ఇదే కావటం విశేషం. ఈ లాటరీ విక్రయించిన సర్కిల్ కే స్టోర్కు అమ్మకపు ప్రోత్సాహం కింద 50 వేల డాలర్లు అందించనుంది అరిజోనా లాటరీ.