'కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి న్యూయార్క్ సిద్ధంగా ఉంది... ప్రపంచంలోనే అత్యద్భుత ఆరోగ్య వ్యవస్థ న్యూయార్క్ సొంతం... మిగతా దేశాల్లోలా న్యూయార్క్‌లో జరిగే ప్రసక్తే లేదు..' ఇవీ అమెరికాలో వైరస్ విజృంభిస్తున్న తొలినాళ్లలో న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో చేసిన ప్రకటనలు.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనన్ని వైరస్ కేసులు న్యూయార్క్‌లో ఉన్నాయి. అగ్రరాజ్యంలో సంభవించిన మరణాల్లో దాదాపు సగం న్యూయార్క్‌కు చెందినవే.
న్యూయార్క్ అనగానే ముందుగా గుర్తొచ్చేది 9/11 ట్విన్ టవర్స్ ఉగ్రదాడి. న్యూయార్క్ ప్రజలు ఆ ఘటనను ఎన్నటికీ మర్చిపోలేరు. కానీ ఉగ్రదాడిలో మృతిచెందిన వారి సంఖ్యను కరోనా మరణాలు ఎప్పుడో దాటేశాయి.
మరి ఈ పరిస్థితులకు కారణాలేంటి? నేతలు, అధికారుల వైఫల్యాలేనా?
జనాభా, విదేశీ పర్యటకుల సంఖ్య...
ఈ స్థాయిలో వైరస్ విజృంభించడానికి ప్రధాన కారణం రాష్ట్రంలోని జనాభా అంటున్నారు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో. అమెరికా వాణిజ్య రాజధానిలో 86లక్షల మంది నివాసముంటున్నారు. ఒక్క చదరపు కిలోమీటరుకు 10వేల మంది జీవిస్తున్నారు. అమెరికాలోనే ఇది అత్యంత జన సాంద్రత కలిగిన ప్రాంతం.
ఇక్కడి సబ్‌వేల్లో రద్దీ కూడా అసాధారణంగా ఉంటుంది. తీవ్ర రద్దీ సమాయాల్లో నిల్చోవడానికి కూడా ఖాళీ ఉండదు.
విదేశీ పర్యటకుల సంఖ్య కూడా ఓ కారణంగా చెబుతున్నారు ఆండ్రూ. ఏటా 6కోట్ల మందికిపైగా పర్యటకులు న్యూయార్క్ వస్తుంటారు. అమెరికాలో ఎక్కడికి వెళ్లాలన్నా.. దాదాపు అందరూ న్యూయార్క్నే ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటారు. దీని బట్టి.. అగ్రరాజ్యంలో వైరస్ వ్యాప్తి ఇక్కడి నుంచే మొదలైందని అంచనా వేయొచ్చు.
సామాజిక, ఆర్థిక అసమానతలు...
న్యూయార్క్‌లో పేద, ధనిక భేదం చాలా ఎక్కువ. ముఖ్యంగా బ్రాన్క్స్, క్వీన్స్ ప్రాంతాల్లోని వారికి ఎన్నో ఏళ్లుగా సరైన ఆరోగ్య వసతులు లేవు. కరోనా విజృంభణకు ముందు నుంచే అనేక వ్యాధులతో వారు సతమతమవుతున్నారు.
నేతలు, అధికారుల తప్పెంత?
కరోనాపై పోరులో నేతలు, అధికారులు సరైన సమయానికి స్పందించకపోవడమూ తాజా పరిస్థితులకు ఓ కారణమే. న్యూయార్క్‌లో మార్చి 1న తొలి కరోనా కేసు నమోదవగా... 15రోజుల వరకు అన్ని రకాల వాణిజ్య కేంద్రాలు తెరిచే ఉన్నాయి. అనంతరం న్యూయార్క్‌లోని అన్ని పాఠశాలలు, బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తున్నట్టు నగర మేయర్ బిల్.. 16న ప్రకటించారు. అది జరిగిన వారానికి.. అంటే 22 మార్చికి.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, నిత్యావరసరాల వ్యాపారం మినహా ఎలాంటి కార్యకలాపాలు జరగకూడదని ఆదేశాలు జారీ చేశారు.
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆదేశాల జారీకి అధికారులు చాలా సమయం తీసుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 6 రోజులంటే.. ఓ కాంతి సంవత్సరంతో సమానమని అభిప్రాయపడుతున్నారు. ఫలితమే ఇప్పటి పరిస్థితులని అంటున్నారు.
అయితే వీటన్నిటికీ కారణం మేయర్, గవర్నర్ నిర్ణయాలే అనడం సరైనది కాదు. విపత్కర పరిస్థితుల్లో వారిపై తీవ్ర ఒత్తిడి పడింది. తక్షణమే లాక్డౌన్ విధించాలని కొందరు... అలా జరిగితే ఆర్థికంగా న్యూయార్క్‌పై కోలుకోలేని దెబ్బపడుతుందని మరికొందరు.. వారిని అయోమయంలోకి నెట్టేశారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కూడా సరైన మార్గనిర్దేశం లేకపోవడం పరిస్థితులను మరింత దారుణంగా మార్చింది.
ఇక మాటల యుద్ధమేనా...?
కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. అమెరికాలో తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నెలకొనే అవకాశముంది. ఇప్పటికే.. డెమొక్రాట్లు ఆండ్రూ, బిల్లు ప్రత్యక్షంగానే ట్రంప్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్‌లో పరీక్షలు నిర్వహించడానికి ట్రంప్ ప్రభుత్వం సరైన వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటిలేటర్ల తయారీకి అనుమతులివ్వడం లేదని అక్కడి అధికారులు మండిపడుతున్నారు.
కరోనా సంక్షోభంతో న్యూయార్క్ భారీ ముల్యం చెల్లించుకుంటోంది. శుక్రవారం వరకు న్యూయార్క్‌లో దాదాపు 1,60,000 కేసులు నమోదయ్యాయి. 7 వేల 800కుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:- అమెరికాపై కరోనా పంజా- ఒక్కరోజులో రికార్డు మరణాలు