కొవిడ్-19 రోగికి రెండు ఊపిరితిత్తుల మార్పిడిని అమెరికా వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. భారత సంతతికి చెందిన అంకిత్ భరత్ అనే వైద్యుడు ఈ శస్త్రచికిత్స బృందానికి నాయకత్వం వహించారు. కరోనా మహమ్మారి ప్రారంభమయ్యాక అమెరికాలో ఇలాంటి శస్త్ర చికిత్స నిర్వహించడం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు.
షికాగోలోని నార్త్‌వెస్ట్రన్ మెడిసిన్ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. సదరు రోగిని 20 సంవత్సరాలు ఉన్న ఓ యువతిగా వైద్యులు పేర్కొన్నారు. కొవిడ్-19 తీవ్రత వల్ల ఆమె ఆరు వారాల పాటు వెంటిలేటర్, ఎక్మోపై ఉండాల్సి వచ్చింది. ఈ నెల మొదట్లో చికిత్సకు వీలు కాని స్థాయిలో రోగి ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆమెకు రెండు ఊపిరితిత్తులు మార్చాల్సిన అవసరం ఉందని అంకిత్ తెలిపారు. తర్వాత 48 గంటల్లోనే శస్త్రచికిత్సను నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్ కోసం రోగికి కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావాల్సి ఉంటుందని.. ఇందుకోసం ఆమెను నిరీక్షణలో ఉంచాల్సి వచ్చిందన్నారు. తన జీవితంలోనే ఇది సంక్లిష్టమైన శస్త్రచికిత్స అని అంకిత్ తెలిపారు. కొవిడ్ రోగికి ప్రపంచంలోనే తొలిసారిగా గత నెల 26న ఆస్ట్రియాలో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.