కరోనా వైరస్ వల్ల 3.7 కోట్ల మంది తీవ్రస్థాయి పేదరికంలోకి జారిపోయారని బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ విడుదల చేసిన 'గోల్ కీపర్స్ రిపోర్ట్' నివేదిక పేర్కొంది. దీనివల్ల ఆరోగ్య రంగంలో గత కొన్ని దశాబ్దాల్లో సాధించిన పురోగతి మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని తెలిపింది. ఈ మహమ్మారితో ప్రధానంగా ఆర్థికపరంగా నష్టం వాటిల్లిందని వివరించింది. ఆయా దేశాల్లో వైరస్ విస్తృతి స్థాయితో సంబంధం లేకుండా ఈ నష్టం చోటు చేసుకుందని పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలివీ...
- ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల కింద 18 లక్షల కోట్ల డాలర్లను ఖర్చు పెట్టినప్పటికీ 2021 చివరినాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 12 లక్షల కోట్లను కోల్పోతుంది.
- కొవిడ్ వల్ల కొద్ది నెలల్లో తీవ్రస్థాయి పేదరికం 1 శాతం మేర పెరిగింది. దీన్ని తగ్గించడంలో 20 ఏళ్లుగా సాధించిన పురోగతికి అవరోధం ఏర్పడింది.
- కొవిడ్ -19 వల్ల పరోక్షంగా అనేక మంది చనిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆరోగ్య పరిరక్షణ రంగం దెబ్బతినడమే. 25 వారాల్లోనే 25 ఏళ్ల నష్టం జరిగింది.
- విద్యపైనా దీని ప్రభావం పడింది. మహమ్మారి ప్రారంభం కావడానికి ముందే అల్ప, మధ్యాదాయ దేశాల్లో 53 శాతం మంది విద్యార్థులు, సహారా ఎడారి చుట్టుపక్కలున్న ఆఫ్రికా దేశాల్లో 87 శాతం మంది పదేళ్ల వయసు వచ్చినప్పటికీ సరళమైన వాక్యాలు కూడా చదవలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, పాఠశాలల మూసివేత వంటివి ఈ అసమానతలను మరింత పెంచుతాయి. అనేక మంది బాలికలు పాఠశాలలకు తిరిగి రాకపోవచ్చు.
- భారత్లో కరోనా కాలంలో 20 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడంవల్ల పేదరికం, ఆకలి బాధ తగ్గడమే కాక మహిళా సాధికారతకూ బాటలు పరిచినట్లయింది.