కరోనా వైరస్ కారణంగా అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. నిరుద్యోగం ఊహంచని స్థాయికి పెరిగిపోతోంది.
ప్రతి ఆరుగురిలో ఒకరు
1930 నాటి మహా మాంద్యం స్థాయికి ప్రస్తుతం నిరుద్యోగ సమస్య చేరుకుంది. తాజాగా జరిగిన ఓ సర్వే ప్రకారం... ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోయారు.
గత వారంలోనే దాదాపు 44 లక్షల మంది అమెరికా యువత నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 5 వారాల్లో పది ప్రధాన నగరాల నుంచి 2.6 కోట్ల మంది నిరుద్యోగ ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
2010 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 2.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించగా... కరోనా మహమ్మారితో ఇప్పుడు ఆ ఉద్యోగాలన్నీ ఒకే నెలలో పోయాయి.
భారీ ప్యాకేజీతో ఉపశమనం!
మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం దాదాపు 50 వేల కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజీకి సిద్ధమైంది. మంగళవారమే ఎగువ సభ గడప దాటిన ఈ ఆర్థిక బిల్లును... తాజాగా ప్రతినిధుల సభ ఆమోదించింది. నేడు దీనిపై ట్రంప్ సంతకం చేయనున్నారు.
ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం. ఈ నిధులను ఆసుపత్రులకు, కరోనా పరీక్షలకు, ఆంక్షల మూలంగా దెబ్బతిన్న చిన్న వ్యాపారాలకు చేయూత అందించేందుకు ఉపయోగించనున్నారు.
ట్రంప్ ప్రణాళికలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని 33 కోట్ల మంది ప్రజల్లో.. 95 శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఆంక్షలు మే 1 తర్వాత కూడా కొనసాగించే అవకాశం ఉందన్నారు ట్రంప్. అయితే... ఆర్థిక వ్యవస్థను సాధ్యమైనంత త్వరగా తిరిగి గాడిన పెట్టడంపై ఆయన విస్తృత కసరత్తు చేస్తున్నారు. ఆంక్షలు కొనసాగిస్తూనే వ్యాపార కార్యకలాపాలను దశలవారీగా అనుమతించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
అగ్రర్యాజ్యంలో ఇప్పటి వరకు 8,86,709 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 50,243 మంది ప్రాణాలు కోల్పోయారు.