''యువతకు నేనో సందేశం ఇవ్వదలుచుకొన్నా. కరోనా వైరస్‌కు మీరేమీ అతీతులు కాదు. ఇది మిమ్మల్ని కొన్ని వారాలపాటు ఆసుపత్రి పాల్జేయొచ్చు. లేదా మీ ప్రాణాలను కూడా బలితీసుకోవచ్చు''
- డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్
''కేవలం పెద్ద వయస్కులనే దృష్టిలో పెట్టుకొని సిద్ధమయ్యే ఆసుపత్రులు ఒక విషయం తెలుసుకోవాలి. కొవిడ్-19 వయోభేదం లేకుండా అందరిని తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుంది.''
- సీడీసీ నివేదిక
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఎవరూ రోడ్లపైకి రావొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. యువత రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తున్నారు. కొందరి తెగింపు ఏ స్థాయిలో ఉందంటే.. ఛానెల్స్ మైకుల ముందుకొచ్చి తమను కరోనా వైరస్ ఏమీ చేయలేదంటూ ప్రకటనలు కూడా చేసేస్తున్నారు. ఈ వ్యాధి కేవలం మధ్య వయస్కులు, ముసలి వారిపైనే ప్రభావం చూపుతుందనే భ్రమల్లో యువత ఉండటమే దీనికి ప్రధాన కారణం. కానీ అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) జరిపిన అధ్యయనంలో వెల్లడైన వాస్తవాలు యువతకు ప్రమాద ఘంటికలు వినిపించేవే. ‘సివియర్ అవుట్‌కమ్స్ అమాంగ్ పేషెంట్స్ విత్ కరోనావైరస్ డిసీజ్ 2019’ పేరుతో నివేదికను వెలువరించింది.
యువతకూ ముప్పే..
అమెరికాలో కరోనా వైరస్ సోకిన 500 మందిపై సీడీసీ అధ్యయనం నిర్వహించింది. వ్యాధి సోకినప్పటి నుంచి ఐసీయూలో పొందిన చికిత్స వరకు అధ్యయనం చేసింది. వీరి వయస్సుల ఆధారంగా వర్గీకరించింది.
ఐసీయూలో చేరిన వారు వయసుల వారీగా శాతాల్లో...
వయసు | 20-44 | 45-54 | 55-64 | 19లోపు |
ఎంత మంది | 12% | 30% | 36% | - |
20-44 మధ్య వయస్సు వారిలో 12 శాతం మందికి అత్యవసర చికిత్స కూడా చేశారు. సర్వే శాంపిల్ చిన్నది కాబట్టి.. 19 ఏళ్లలోపు వారు వైరస్‌కు అతీతులు అనుకోవద్దని సర్వే పేర్కొంది.
85 ఏళ్లు పైబడిన వారిలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని నివేదిక తేల్చింది. మొత్తం రోగుల్లో 31%, ఆసుపత్రి పాలైన వాళ్లలో 45%, ఐసీయూలో చికిత్స పొందిన వారిలో 53%, మరణించిన వారిలో 80% శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారే ఉన్నారని నివేదిక తేల్చింది. భౌతికదూరం ఈ వ్యాధి వ్యాప్తిని మందగింపచేస్తుందని, అన్ని వయసుల వారూ దీన్ని పాటించాలని నివేదిక సూచించింది.
నా మాట వినండి..
''కరోనా వైరస్‌తో నా పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. వైరస్ మమ్మల్ని ఏమీ చేయలేదని భావించే యువకుల కోసం ఇది చెబుతున్నా. మనం ఎదుర్కొంటున్నది చిన్నముప్పు కాదు. ఆ విషయం అందరికీ చెప్పండి. బాధ్యతగా ఇంటివద్దే ఉండండి. నా పరిస్థితి మరొకళ్లకు రాకూడదని కోరుకుంటున్నా.''
అమెరికాలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువ కాస్ట్యూమ్ డిజైనర్ తరేక్ సోలిమన్ చెప్పిన మాటలివి. కోవిడ్ ఎంత తీవ్రమైందో తన స్వీయానుభవాన్ని వెల్లడిస్తూ సులేమీనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.