Corona in USA: అగ్రదేశం అమెరికాలో కరోనావైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజా విజృంభణకు దోహదం చేస్తోంది. నిత్యం లక్షల్లోనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే మహమ్మారి అడుగుపెట్టిన దగ్గరి నుంచి ఎన్నడూ లేని విధంగా ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సువారిలో ఆ సంఖ్య ఇటీవల వారాల్లో భారీగా పెరిగిందని శుక్రవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
డిసెంబర్ ప్రారంభం నుంచి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి లక్ష మందిలో నలుగురు కంటే ఎక్కువ మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. అదే 5 నుంచి 17 ఏళ్ల చిన్నారుల విషయంలో ఆ సంఖ్య ఒకటిగానే ఉందని గణాంకాలు పేర్కొన్నాయి.
మిగిలిన వయస్సువారితో పోల్చుకుంటే చిన్నారుల్లో ఆసుపత్రి చేరిక తక్కువగానే ఉందని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రాచెల్లె వాలెన్స్కీ వెల్లడించారు. అయితే మహమ్మారి ప్రారంభమైన దగ్గరి నుంచి పిల్లలు ఆసుపత్రుల్లో చేరుతున్న రేటు మాత్రం ఇప్పుడే అత్యధికమని వెల్లడించారు. 12 నుంచి 18 ఏళ్ల వయస్సు వారిలో 50 శాతం కంటే ఎక్కువ మంది మాత్రమే టీకా తీసుకున్నారని, 5 నుంచి 11 ఏళ్ల వయస్సు వారిలో అది 16 శాతంగానే ఉందన్నారు. చిన్నారులు, టీనేజర్లలో మంగళవారం వరకు సగటున రోజుకు 766 మంది ఆసుపత్రుల్లో చేరారు. రెండు వారాల క్రితంతో పోల్చుకుంటే అది రెట్టింపు సంఖ్య.
Corona Deaths In USA Today: ఊబకాయం, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలున్న పిల్లల్లో ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంటోందని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. చిన్నారుల్ని రక్షించుకునేందుకు అంతా టీకా తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని వెల్లడించారు. వాలెన్స్కీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోపక్క సీడీసీ 12 ఏళ్ల వయస్సువారికి కూడా బూస్టర్లను సిఫారసు చేసింది. పెద్దవయస్సు వారిలో 34 శాతం మంది బూస్టర్లు తీసుకున్నారు. కొత్త సంవత్సరంలో 5 ఏళ్ల లోపు పిల్లలకు టీకా అందుబాటులోకి వస్తుందని అక్కడి తల్లిదండ్రులు ఆశించారు. ఆ వయస్సు వారికి ఇప్పటికే టీకా అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఫైజర్ టీకా అందుబాటులోకి వస్తుందని భావించినప్పటికీ.. రెండు డోసుల టీకా ఆశించినంత రక్షణ ఇవ్వడం లేదని సంస్థ గత నెల ప్రకటించి, వెనక్కి తగ్గింది.
ఇదీ చదవండి: ముంబయిలో విజృంభిస్తున్న కరోనా.. మహారాష్ట్రలో 40 వేల కేసులు