Corona cases: ప్రపంచ దేశాలపై కొవిడ్ మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 4,43,677 మందికి వైరస్ సోకింది. 716 మంది ప్రాణాలు కోల్పోయారు.
క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో కేసులు మరింత పెరగనున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే.. ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. పడకలు దొరకక రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు అగ్రరాజ్యంలో కనిపిస్తున్నాయి. కోటికిపైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
15 మందిలో ఒకరికి వైరస్..
బ్రిటన్‌లోనూ కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉంది. ఇంగ్లాండ్‌లో ప్రైవేటు గృహాల్లో నివసించే ప్రతి 25 మందిలో ఒకరికి కొవిడ్ సోకిందని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. మొత్తం 20 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారని తెలిపింది. కరోనా వ్యాప్తి స్థాయి లెక్కింపు ప్రారంభించిన 2020 మార్చి నుంచి ఇదే అత్యధికమని పేర్కొంది. లండన్‌లో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా ఉందని అంచనాకు వచ్చినట్లు తెలిపింది.
వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న దేశాలు..
- ఫ్రాన్స్‌లో కొవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టాకు తోడు ఒమిక్రాన్ కేసులతో కొత్త కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 2.32 లక్షల మందికి వైరస్ సోకింది. 189 మంది మృతి చెందారు. 53వేల మంది వైరస్‌ను జయించారు.
- బ్రిటన్‌లో వైరస్ ఉద్ధృతి కొనసాగతోంది. శుక్రవారం ఒక్కరోజే 1.89లక్షల కేసులు వెలుగుచూశాయి. 203 మంది ప్రాణాలు కోల్పోయారు. 43వేల మంది వైరస్‌ను జయించారు. మొత్తం కేసుల సంఖ్య కోటీ 29 లక్షలు దాటించింది.
- ఇటలీలో శుక్రవారం కొత్తగా 1.44లక్షల మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 155 మంది ప్రాణాలు కోల్పోగా, 22వేల మంది వైరస్‌ను జయించారు.
- అర్జెంటీనాలో కొత్తగా 47,663, కెనడా-41,217, గ్రీస్-40,560, టర్కీ-40,786 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:- 'ఒమిక్రాన్‌తో కరోనా కేసుల సునామీ'