వార్తా పత్రికలు, మ్యాగజీన్ల ద్వారా కరోనా వైరస్ సోకిన దాఖలా ప్రపంచవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అనేక పరిశోధనలు, అధ్యయనాలు జరిపిన తర్వాత ప్రపంచస్థాయి అత్యుత్తమ వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నారు. ముద్రిత లేఖలు లేదా ప్రింటెడ్ బండిళ్ల ద్వారా కూడా ఈ వైరస్ సోకినట్లుగా ఎక్కడా తేల్లేదని స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేకుండా వ్యాప్తిచెందే అపోహలపై అనవసర భయాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ది జర్నల్ ఆఫ్ హాస్పిటల్ ఇన్ఫెక్షన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ (ఎన్‌ఐహెచ్), జాన్ ఇన్నెస్ సెంటర్ (ఎంపీ3) తదితర ప్రఖ్యాత సంస్థలు, పలు విశ్వవిద్యాలయాలు సమగ్ర పరిశోధన చేసినట్లు ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్(ఇన్మా) కార్యనిర్వాహక డైరెక్టర్, సీఈవో ఎర్ల్ జె.విల్కిన్‌సన్ వివరించారు. దీనిపై అనేక ఇతర ఆధారాలతో తాము మరింత విస్తృతంగా కూడా పరిశోధిస్తున్నట్లు వివరించారు. పత్రికలకు వాడే కాగితం(న్యూస్‌ప్రింట్) ఉపరితలం వైరస్ వ్యాప్తి చెందని విధంగా ఉంటుందని.. సురక్షితమేనని తేలినట్లు స్పష్టం చేశారు.
పత్రికలు చాలా సురక్షితం
సహజంగానే పత్రికలను ముద్రించే కాగితం (న్యూస్‌ప్రింట్) ఉపరితలం, ముద్రించే విధానం వంటివన్నీ వైరస్ వ్యాప్తికి అవకాశం లేని విధంగా, సురక్షితంగా ఉంటాయి. కాబట్టి పాఠకులకు ఎలాంటి భయాలు, సందేహాలు అవసరం లేదు. పత్రికల ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశం లేదనడానికి ప్రధానంగా 4 శాస్త్రీయ ఆధారాలు ఇవీ...
- వార్తా పత్రికలకు వాడే సిరా (ఇంక్), ముద్రణ విధానాల ద్వారా అవి సహజంగానే క్రిమి రహితం(స్టెరైల్)గా తయారవుతాయి.
- పాఠకుల సంరక్షణే ధ్యేయంగా పత్రికా యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి. ముద్రణ ప్రాంతాలు, పత్రికల పంపిణీ కేంద్రాలు, న్యూస్ సెంటర్లు, ఇళ్లకు అందజేసేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
- పత్రికల ద్వారా కొవిడ్-19 సోకిన దాఖలా ప్రపంచంలోనే ఒక్కటి కూడా లేదు.
- న్యూస్‌ప్రింట్ వంటి 'పోరస్' (సన్నటి సూక్ష్మమైన రంధ్రాలు కలిగిన) ఉపరితలాల ద్వారా వ్యాప్తి చెందే శక్తి వైరస్‌కు చాలా చాలా తక్కువ.
పరిశోధనలు.. అధ్యయనాలు..
వైరస్ వ్యాప్తికి అవకాశం లేదు..
"ప్యాక్ చేసిన బండిల్‌పై వైరస్ సోకే అవకాశం ఉండదు. ఒకచోట తయారై, అనేక విధాలుగా, రవాణా అయ్యే ప్యాకేజీలు, వాణిజ్య వస్తువులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ. ఈ ప్యాకేజీలు అనేక ఉష్ణోగ్రతలు, భిన్నమైన పరిస్థితుల్లో రవాణా అవుతుంటాయి కాబట్టి వీటికి వైరస్ ముప్పు చాలా తక్కువ." - ప్రపంచ ఆరోగ్య సంస్థ
న్యూస్‌ప్రింట్‌పై వైరస్ ఉనికి అత్యల్పం
కరోనా వైరస్ వేర్వేరు ఉపరితలాలపై వేర్వేరు విధాలుగా ఉంటుంది. గాలి తుంపర్లు, ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్, రాగి, దళసరి అట్టలు (కార్డ్‌బోర్డ్) వైరస్ వాహకాలే అయినప్పటికీ.. వీటిలో పరమాణు నిర్మాణ క్రమం వల్ల రాగిలోనూ, సన్నటి సూక్ష్మమైన రంధ్రాలు ఉండటం (పోరస్ నేచర్) వల్ల కార్డ్‌బోర్డ్ ద్వారా వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇక న్యూస్‌ప్రింట్‌లో సన్నటి సూక్ష్మమైన రంధ్రాలు చాలా ఎక్కువ ఉండటం వల్ల వైరస్ ఉనికి చాలా చాలా తక్కువ.
వైరస్ బలహీనపడే క్రమం..
"గాల్లోకి వెళ్లిన తర్వాత క్రమేపీ వైరస్ శక్తి సన్నగిల్లిపోతుంది. ప్రతి 66 నిమిషాలకు దీని శక్తి సగానికి పడిపోతుంటుంది. వైరస్ ఒక తలంపైకి చేరిన తర్వాత 3 గంటలకు ఇది సంక్రమించే శక్తిలో ఎనిమిదో వంతు మాత్రమే మిగిలి ఉంటుంది. 6 గంటల తర్వాత ఆ శక్తి 2 శాతం మాత్రమే ఉంటుంది."
- ఎన్‌ఐహెచ్; సీడీసీ; ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం; యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ శాస్త్రవేత్తల అధ్యయనం
సహజంగానే పత్రికలు క్రిమి రహితం..
"ముద్రణ అనంతర ప్రక్రియ విధానాల వల్ల సహజంగానే వార్తాపత్రికలు 'శుభ్రంగా'(స్టెరైల్)గా ఉంటాయి. వాటిని ముద్రించేందుకు వాడే సిరా (ఇంక్)తో పాటు ముద్రణ విధానం అందుకు దోహదపడతాయి. అందువల్ల పత్రికల ద్వారా సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉండదనే చెప్పొచ్చు." - జాన్ ఇన్నెస్ సెంటర్(యూకే) వైరాలజీ నిపుణుడు జార్జ్ లోమొనోస్సోఫ్
ఇదీ చూడండి: ఒకేసారి కరోనా మోత... దేశంలో పెరిగిన కేసులు