ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు చైనా తీవ్రంగా కృషిచేస్తోంది. ఇందుకోసం ఇతర దేశాలతో శత్రుత్వం పెట్టుకోవడానికీ వెనుకాడడం లేదు. ఏడాది కాలంలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత్-అమెరికాకు పెను సవాళ్లు విసురుతోంది చైనా. అయితే చైనా విసురుతున్న సవాళ్ల వల్ల భారత్-అమెరికా బంధం మరింత బలపడుతుందని మాజీ దౌత్యవేత్తలు, భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ సహకారం పెరుగుతుందని ఆశిస్తున్నారు.
చైనాపై కఠినంగానే!
ఆసియాపై విధానపరంగా బైడెన్ ప్రభుత్వ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశారు విదేశాంగ మంత్రిగా ఎంపికైన ఆంటోని బ్లిన్కెన్. చైనా నుంచి అమెరికాకు సవాళ్లు ఎదురవుతాయని, అందువల్ల ఆ దేశంపై బైడెన్ ప్రభుత్వం కఠినంగానే ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- 'అమెరికా నాయకత్వ పాత్ర పోషించాలి'
చైనా నుంచి భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని 2015-16లో అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన మాజీ దౌత్యవేత్త అరుణ్ సింగ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఆర్థిక, సాంకేతికత, సైనికపరంగా చైనా నుంచి అగ్రరాజ్యం ముప్పు ఎదుర్కొంటోందన్నారు. ఈ పరిణమాల వల్ల భారత్-అమెరికా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.
20ఏళ్లుగా భారత్-అమెరికా బంధం బలపడుతూ వస్తోందని.. బైడెన్ హయాంలోనూ అదే కొనసాగుతుందని రాయబారి, గేట్వే హౌస్ థింక్ట్యాంక్ సభ్యుడు రాజీవ్ భాటియా అభిప్రాయపడ్డారు. అయితే చైనాతో అమెరికా బంధం ఎలా ఉంటుందన్నది కీలకమని పేర్కొన్నారు.
"భారత్-అమెరికా మధ్య మైత్రి.. 20ఏళ్లుగా మెరుగుపడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అయితే ఆసియాపై అమెరికా విధానం, అదే ప్రాంతంలో చైనా విధానాలు రానున్న నెలల్లో ఎలా ఉంటాయన్నది కీలకం. భారత్-అమెరికా మైత్రిపై ఇది ప్రభావం చూపుతుంది. చైనా తమ శత్రువు అని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ అవసరం ఉంది. అదే సమయంలో ఆసియాలోని భౌగోళిక రాజకీయాల పరిస్థితులను పరిశీలిస్తే భారత్కు అమెరికా అవసరం ఉందని అర్థమవుతుంది. అందువల్ల భారత్-అమెరికా మధ్య రక్షణ, భద్రత సహకారం బలపడుతుందని భావిస్తున్నా."
-- రాజీవ్ భాటియా, గేట్వే హౌస్ థింక్ ట్యాంక్ సభ్యుడు.
ఇదీ చూడండి:- బైడెన్ వచ్చేశారు- మరి భారత్కు లాభమేనా?