కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా పరిశోధకుడు బింగ్ లియు(37) అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో హత్యకు గురయ్యారు. ఆయన పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసేవారు.
పిట్స్‌బర్గ్‌కు ఉత్తరాన రాస్ టౌన్‌షిప్‌లోని తన నివాసంలో లియు శనివారం శవమై కనిపించారు. హో గు అనే వ్యక్తి ఆయన్ను కాల్చి చంపి, ఆపై తనను తాను కాల్చుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హో మృతదేహాన్ని కూడా వారు గుర్తించారు. కరోనా వైరస్ సోకినప్పుడు కణ స్థాయిలో చోటుచేసుకునే మార్పులను పూర్తిస్థాయిలో అర్థం చేసుకునే దిశగా జరిపిన ప్రయోగాల్లో కీలక ముందంజ వేసిన సమయంలో లియు హత్యకు గురవడం గమనార్హం.