అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సులేమానీ మట్టుబెట్టడం వల్ల ఇరాన్‌తో తలెత్తిన వివాదానికి రాజీ కుదిర్చే ప్రయత్నం చేసింది చైనా. ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక దళాలను ఉపయోగించడం కాకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికాను కోరింది. ఇదే విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్.. ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్‌తో ఫోన్ సంభాషణలో స్పష్టం చేశారు. ఈ మేరకు చైనా విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
"అమెరికా అంతర్జాతీయ సంబంధాల నిబంధనలను ఉల్లంఘించి సైనిక చర్యలను ప్రయోగించింది. దీని వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం చేస్తుంది."
- ప్రకటన, చైనా విదేశాంగ కార్యాలయం.
అమెరికా, ఇరాన్‌ల మధ్య నాలుగు దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు లేకపోవడం.... తాజాగా ఇరాన్ రెండో అత్యున్నత నేత సులేమానీని యూఎస్ హతమార్చిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ చైనాతో సహా మిత్రదేశాలతో కలిసి తగిన రీతిలో ప్రతీకారం తీసుకుంటానని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చర్చలు ద్వారానే ఇరాన్‌తో సంధి కుదుర్చుకోవాలని చైనా అమెరికాను కోరింది.