కరోనా పుట్టుకపై అనిశ్చితి, డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తులో స్పష్టమైన కారణాలు లేవని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ వ్యాప్తి గురించి పారదర్శకంగా వ్యవహరించాలని చైనాకు హితవు పలికింది. ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. భవిష్యత్లో మహమ్మారులకు వ్యతిరేకంగా బలమైన వ్యవస్థను నిర్మించేందుకు దృష్టిసారించాలని అన్నారు.
"మరో మహమ్మారిని నివారించేందుకు సాధ్యమైనవన్నీ చేయాలి. 2019 వ్యాప్తి(కరోనా)పై పారదర్శకత ఉండాలి. ఈ విషయంలో జవాబుదారీతనం కావాలి. భవిష్యత్లో ఇలాంటివి ఎదురైతే కనీసం వాటి ప్రభావాన్ని సమర్థవంతంగా తగ్గించేందుకైనా ప్రయత్నించాలి. ఇందుకోసం డబ్ల్యూహెచ్ఓ లాంటి వ్యవస్థ, సమాచారాన్ని పంచుకునే విధంగా పారదర్శకంగా ఉండాలి. అంతర్జాతీయ నిపుణులకు సమాచారం అందుబాటులో ఉంచాలి."
- ఆంటోనీ బ్లింకెన్, అమెరికా విదేశాంగ మంత్రి
వుహాన్లో ఐరాస నిపుణుల పర్యటన అనంతరం డబ్ల్యూహెచ్ఓ-చైనా కలిసి రూపొందించిన దర్యాప్తు నివేదిక విధివిధానాలు, ప్రక్రియపైనా బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని రూపొందించడంలో చైనా ప్రభుత్వం కలుగరజేసుకొని ఉంటుందన్నారు. అయితే, నివేదికలో ఏముందో చూడాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
గతంలోనూ చైనాపై విమర్శలు కురిపించారు బ్లింకెన్. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా వైరస్ సమాచారాన్ని పంచుకోవడంలో చైనా విఫలమైందని ఆరోపించారు.
ఇదీ చదవండి: జంతువుల ద్వారానే మనుషుల్లోకి కరోనా!