చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చెందిన అమెరికన్ పాత్రికేయులను దేశం నుంచి బహిష్కరించింది. విదేశీ మీడియాపై చైనా ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.
"పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, హాంకాంగ్ సహా మకావో ప్రత్యేక పరిపాలనా ప్రాంతంలోనూ పాత్రికేయులుగా పనిచేయడానికి వీరిని అనుమతించం."
- చైనా విదేశాంగ శాఖ
'ఈ ఏడాది చివరి నాటికి ప్రెస్ కార్డ్ గడువు ముగియనున్న జర్నలిస్టులు బుధవారం నుంచి నాలుగు రోజుల్లో ఆ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖకు తెలియజేయాలి. వారి క్రెడెన్షియల్స్‌ను 10 రోజుల్లో తిరిగి ఇవ్వాలి' అని చైనా విదేశాంగ శాఖ ఆదేశించింది.
ప్రతీకార చర్య
"అమెరికాలో ఉంటూ చైనా ప్రభుత్వ మీడియా కోసం పనిచేయడానికి అనుమతి పొందిన మా పౌరుల సంఖ్యను తగ్గించాలని వాషింగ్టన్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రతీకారంగానే అమెరికన్ పాత్రికేయులను దేశం నుంచి బహిష్కరించాం."
- చైనా విదేశాంగ శాఖ ప్రకటన
అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్, టైమ్ మ్యాగజైన్... చైనాలోని తమ సిబ్బంది, ఆర్థిక కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్ సమాచారం మొత్తాన్ని లిఖిత పూర్వకంగా ప్రకటించాలని ఆ దేశ విదేశాంగశాఖ ఆదేశించింది. ఇటీవల చైనా మీడియాపై అమెరికా ప్రభుత్వం కూడా ఇలాంటి నిబంధనలే విధించింది.
నువ్వంటే.. నువ్వే
ప్రపంచాన్ని చుట్టిముట్టి అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'చైనీస్ వైరస్'గా అభివర్ణించారు. మరోవైపు ఓ చైనా అత్యున్నత అధికారి అమెరికా సైన్యమే తమ దేశంలో కరోనాను ప్రవేశపెట్టి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనిని అమెరికా కుట్రగా అభివర్ణించారు. దీనితో ఇరుదేశాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాలు పాత్రికేయులపై ప్రతాపం చూపిస్తున్నాయి.
ఇదీ చూడండి: కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నారిలా...