చైనాలో శనివారం మరో 28 కరోనా మరణాలు సంభవించాయి. దీనితో ఈ మహమ్మారి వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,070కి చేరుకుంది.
చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకారం, వైరస్‌కు కేంద్రమైన హుబే వెలుపల కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హుబేలో కరోనా బాధితులు క్రమంగా తగ్గుతున్నారు. అక్కడ మరో 75 మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని వైరస్ వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా పూర్తిగా (లాక్డౌన్) నిర్బంధంలో ఉంచారు.
భయాలున్నాయ్
చైనా ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యల ఫలితంగా హుబే ప్రావిన్స్‌లో గత కొన్ని వారాలుగా కొత్త కరోనా కేసులు బాగా తగ్గాయి. అయితే విదేశాల నుంచి వచ్చిన వారిలో 24 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ఈ కారణంగా మరోసారి ఈ అంటువ్యాధి విజృంభించే అవకాశముందని ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. దాదాపు 100 దేశాల్లో ఈ మహమ్మారి వ్యాపించిందని సమాచారం.
'కరోనా మమ్మల్ని ఏం చేయలేదు'
కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ... ఈ వైరస్ వల్ల అమెరికా ప్రజలకు వచ్చే ప్రమాదం తక్కువేనని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అట్లాంటాలోని వ్యాధి నివారణ, నియంత్రణ కేంద్ర కార్యాలయాన్ని (సీడీసీ) శుక్రవారం సందర్శించిన ఆయన ఈ మేరకు అభిప్రాయపడ్డారు.
జోన్స్ హాప్కిన్స్ ప్రకారం, కరోనా వల్ల ఇప్పటి వరకు అమెరికాలో 14 మంది చనిపోగా, మరో 299 మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. మరోవైపు విదేశీ ప్రయాణికులను తీసుకొచ్చిన కాలిఫోర్నియా తీరంలోని క్రూయిజ్ షిప్లో 21 మందికి కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో నిర్ధరణ అయ్యింది. వీరిలో 19 మంది ఓడ సిబ్బందేనని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు.
ఇదీ చూడండి: 'కరోనాపై నిర్లక్ష్యం తగదు.. వెనుకడుగు వేయొద్దు'