ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్థాన్‌కు మరోసారి వంత పాడింది చైనా. ఉగ్రవాదంపై పోరులో పాక్ ఎన్నో త్యాగాలు చేసిందని కితాబిచ్చింది. ఉగ్రమూకలపై పాక్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని భారత్-అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేసింది.
"ఉగ్రవాదం.. అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ ఎంతో కృషి చేస్తోంది. ఎన్నో త్యాగాలు చేసింది. అంతర్జాతీయ సమాజం దానిని గుర్తించి గౌరవించాలి. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుంది."
- ఝావో లిజియాన్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
భారత్-అమెరికా తీవ్రవాద నిరోధక ఉమ్మడి బృందం 17వ సమావేశం ఈ నెల 9,10 తేదీల్లో వర్చువల్‌గా జరిగింది. ఉగ్రవాద కార్యకలాపాలు పాక్ భూభాగంలో జరగకుండా ఆ దేశం తక్షణం కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత్, అమెరికా సంయుక్తంగా ప్రకటన చేశాయి. ముంబయి, పఠాన్‌కోట్ దాడులకు పాల్పడిన ముష్కరులపై సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఇదీ చూడండి: 'ఉగ్రమూకలపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి'