కశ్మీర్ విషయంలో ఐరాస భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు చుక్కెదురు అయింది. 73 నిమిషాల పాటు జరిగిన రహస్య చర్చలో పాక్‌ను బలపరుస్తూ చైనా చేసిన వాదనలు నిలబడలేదు. చైనా ప్రతిపాదనలను రష్యా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
అగ్రదేశాల మద్దతు
భారత్‌కు అండగా నిలబడిన రష్యా.. కశ్మీర్ విషయం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది. భద్రతామండలిలోని మిగతా దేశాలు కూడా కశ్మీర్‌పై పాకిస్థాన్ వాదనను వ్యతిరేకించాయి. ఫలితంగా పాక్‌కు చైనా తప్ప వేరే ఏ దేశమూ మద్దతివ్వని పరిస్థితి నెలకొంది.
కశ్మీర్ భారత్ అంతర్గతం
సమావేశం ముగిశాక ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ తీరును విమర్శించారు భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్. ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని చెప్పారు. ఇందులో ఇతరులు జోక్యం చేసుకోలేరని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతమివ్వడం ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు.
ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అంశంపై అత్యవసరంగా చర్చ జరగాలని ఐరాస భద్రతా మండలికి లేఖ రాసింది పాకిస్థాన్. పాక్ విన్నపాన్ని ప్రస్తావిస్తూ ఐరాసకు చైనా లేఖ రాసింది. ఈ మేరకు ఐరాస భద్రతా మండలి రహస్య సంప్రదింపులు జరిపింది.
ఇదీ చూడండి: భారత దౌత్యవేత్తకు పాకిస్థాన్ సమన్లు