ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా మరింత దూకుడుగా బలవంతపు విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు అమెరికాలోని పెంటగాన్ ఉన్నతాధికారి డాక్టర్ కాథ్లీన్ హిక్స్. అక్కడ తన సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచిందని, ఎంతకైనా తెగించేందుకు సుముఖంగా ఉన్నట్లు చాటిచెబుతోందని విశ్లేషించారు. నేషనల్ వార్ కాలేజ్‌లో అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశంలో హిక్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా బలవంతపు, దూకుడు విధానాలను అవలంబిస్తోంది. అక్కడ మిలటరీ సామర్థ్యాన్ని విస్తరించడం సహా తెగింపునకు సిద్ధంగా ఉన్నట్లు చాటుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో సాయుధ ఘర్షణకు దిగడం వల్ల ఇరు దేశాల్లో ప్రాణనష్టం సంభవించింది. హాంకాంగ్‌లో అణచివేతకు గురిచేసే జాతీయ భద్రత చట్టం అమలు చేయడం ద్వారా తన పట్టును మరింత బిగించింది."
- డా.కాథ్లీన్ హిక్స్, రక్షణశాఖ ఉప కార్యదర్శి
చైనా చర్యలు ప్రాంతీయ శాంతి, సుస్థిరతలను, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని హిక్స్ విమర్శించారు. చైనాకు మాత్రమే స్వేచ్ఛ, స్థిరమైన అంతర్జాతీయ వ్యవస్థను సవాలు చేసే ఆర్థిక, దౌత్య, సైనిక, సాంకేతిక శక్తి ఉన్నాయని చెప్పారు.
ఇదీ చూడండి: భారత్‌కు పాక్ బృందం- జలవివాదాలపై చర్చ