దక్షిణాసియా వ్యవహారాల్లో చైనా తన పాత్రను పెంచుకుంటోందని.. ఇది ఆ ప్రాంతం రాజకీయ, ఆర్థిక, భద్రతపై ప్రభావం చూపుతుందని అమెరికాకు చెందిన ఓ పరిశోధనా సంస్థ వెల్లడించింది. ఈ వ్యవహారంపై దృష్టిసారిస్తేనే.. దక్షిణాసియా ప్రాంతంలో తమ విధానాలను విజయవంతంగా అమలు చేయడానికి అమెరికాకు ఆస్కారం ఉంటుందని తన నివేదికలో పేర్కొంది యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్. చైనా ఉనికి పెరుగుతుండటం వల్ల ఆ ప్రాంతంలో పోటీతత్వం మెరుగుపడుతోందని పేర్కొంది.
ఈ 'చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కాన్ఫ్లిక్ట్ డైనమిక్స్ ఇన్ సౌత్ ఏషియే స్టేట్ట్' నివేదికను సీనియర్ నిపుణులు, మాజీ విధానకర్తలు, విశ్రాంత దౌత్యవేత్తలు రూపొందించారు. చైనా ఉనికి వల్ల దక్షిణాసియాలో ఇప్పటికే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని వీరు నివేదికలో పేర్కొన్నారు. అమెరికా-చైనాలకు దక్షిణాసియా ఎంతో ముఖ్యమైన ప్రాంతంగా అభివర్ణించారు. అయితే.. ఇరు దేశాల ద్వైపాక్షిక పోరు వల్ల ఆ ప్రాంతంలో సహకారం క్లిష్టంగా మారుతుందని.. ముఖ్యంగా ఏదైనా సంక్షోభం తలెత్తితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.
చైనా-పాకిస్థాన్ సత్సంబంధాలు మరింత ధృడమైనట్లు పరిశోధనా సంస్థ అభిప్రాయపడింది. భారత్- పాకిస్థాన్ మధ్య వైరం కొనసాగుతోన్న నేపథ్యంలో చైనా వైఖరి... పాక్‌కే అనుకూలంగా ఉన్నట్టు తన నివేదికలో పేర్కొంది. కశ్మీర్ విషయంలో చైనా ప్రవర్తించిన తీరు ఇందుకు నిదర్శనమని తెలిపింది. చైనా- భారత్ సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని.. అదే సమయంలో ఇరు దేశాల మధ్య పోటీతత్వం భారీగా పెరుగుతుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:టీకాపై తప్పుడు ట్వీట్లు చేస్తే ఇక అంతే!