భారత్‌తో సరిహద్దు వివాదాలకు తెరలేపుతున్న చైనాపై అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్ సహా పొరుగు దేశాలతో 'డ్రాగన్' కవ్వింపు చర్యలకు దిగుతోందని.. బలవంతపు సైనిక, పారామిలిటరీ ఆందోళనకు తెరతీస్తోందని స్పష్టం చేసింది. ఈ మేరకు 'వైట్ హౌజ్' గురువారం ఓ అధికారిక నివేదిక విడుదల చేసింది. సరిహద్దుల్లో చైనా దురుసు వైఖరి ప్రదర్శిస్తోందని అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఒకరు వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ నివేదిక వెలువడడం గమనార్హం.
దక్షిణ చైనా సముద్రం, యెల్లో సీ, తైవాన్ జలసంధి, భారత్-చైనా సరిహద్దు విషయంలో చైనా చెబుతున్న మాటలకు.. చేతలకు పొంతన లేదని నివేదిక అభిప్రాయపడింది. తరచూ పొరుగుదేశాలతో కవ్వింపు చర్యలకు దిగుతూ దురుసు వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడింది. చైనా ఆర్థికంగా బలపడుతున్న కొద్దీ అక్కడి 'చైనీస్ కమ్యూనిస్టు పార్టీ'(సీసీపీ) బెదిరింపులు, దురుసుతనాన్ని ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించింది. తమ ప్రయోజనాలను, వ్యూహాత్మక లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్న వారందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేసింది.
అసమంజస విధానాల ద్వారా ప్రపంచ సమాచార సాంకేతికత వ్యవస్థను చైనా కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందని నివేదిక అభిప్రాయపడింది. 'నేషనల్ సైబర్ సెక్యూరిటీ చట్టం' ద్వారా సమాచార స్థానికీకరణను తప్పనిసరి చేసినట్లు గుర్తుచేసింది. దీంతో ప్రపంచ దేశాల సమాచారాన్ని సీసీపీ తన గుప్పిట్లో ఉంచుకునేందుకు యత్నిస్తోందని కుండబద్దలు కొట్టింది.
వ్యూహాత్మకంగా..
చైనాను వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వైట్ హౌజ్ నివేదిక గుర్తుచేసింది. అమెరికా వ్యూహాత్మక విధానం ద్వారా ఆయా దేశాల ప్రయోజనాలను, ఉమ్మడి విలువలను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పడ్డ అనేక భాగస్వామ్యాలను నివేదిక గర్తుచేసింది. ఈ నివేదికపై పలువురు ఉన్నతాధికారులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. దీని ద్వారా చైనా పట్ల అమెరికా ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య దేశాలు, మిత్రపక్షాలతో కలిసి సీసీపీ విసురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా స్పష్టంగా వివరించిందని తెలిపారు.
భారత్-చైనా సరిహద్దు ఘర్షణపై గురువారం మాటల యుద్ధం చెలరేగింది. సరిహద్దుల్లో చైనా దురుసు వైఖరి ప్రదర్శిస్తోందని అమెరికా స్పష్టం చేసింది. కవ్వింపు చర్యలతో యథాతథస్థితిని మార్చడానికి 'డ్రాగన్' ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. ఇటీవల భారత్, చైనాల సరిహద్దుల్లో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల సైనికులు రాళ్లు, పిడి గుద్దులతో పరస్పరం దాడి చేసుకున్నారు. భారత గస్తీ బృందాలకు చైనా దళాలే అవరోధాలు సృష్టిస్తున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.