అమెరికాతో చైనా జగడాలను మాని, శాంతి మంత్రం జపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన విదేశాంగ విధానంపై.. ఆ దేశం సానుకూలంగా స్పందించింది. అమెరికా, చైనాలు కలిస్తే ఎన్నో గొప్ప విజయాలు సాధించవచ్చని పేర్కొంది. తమ మధ్య ఉన్న విభేదాల కంటే ఉమ్మడి ఆసక్తులు.. అత్యంత బలమైనవని చెప్పింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తెలిపారు.
"పెద్ద దేశాలైన చైనా, అమెరికాలు.. ప్రపంచ శాంతి, శ్రేయస్సును కాపాడటంలో బాధ్యతలను పంచుకుంటాయి. ఇరు దేశాల మధ్య విభేదాలు ఉండటం సహజమే అయినా.. అవి ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాల ముందు చాలా చిన్నవి. అమెరికా, చైనాలు కలిస్తే.. తమకే కాదు, ప్రపంచ దేశాలకు ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది."
--వాంగ్ వెన్బిన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.
అంతకుముందు.. చైనాను అమెరికాకు అతిపెద్ద పోటీదారుగా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. చైనా దూకుడు, బలవంతపు చర్యలకు కళ్లెం వేస్తామని స్పష్టం చేశారు. కానీ, అమెరికా వాసుల కోసం అవసరం అయితే డ్రాగన్‌తో దోస్తీ చేసేందుకు కూడా వెనుకాడబోమని పేర్కొన్నారు.
అమెరికా-చైనా బంధం ట్రంప్ హయాంలో ఎన్నడూలేని స్థాయిలో దెబ్బతింది. వాణిజ్యం, కరోనా పుట్టుక, దక్షిణ చైనా సముద్రంలో సైన్యం కదలికలు, తైవాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన వంటి విషయాల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇప్పుడు బైడెన్‌తో మళ్లీ సంబంధాలను పునురుద్ధరించుకునే ప్రయత్నాలు చైనా చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇదీ చదవండి:భారతీయ అమెరికన్ నామినేషన్‌ను రద్దు చేసిన బైడెన్