ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న సమాచారంతో పోలిస్తే... కరోనా బారినపడ్డ చిన్నారుల సంఖ్య చాలా ఎక్కువే ఉండొచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. వీరు కొవిడ్-19పై చైనాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకులు ఇచ్చిన నివేదికలోని అంశాలను విశ్లేషించారు.
ఇంటెన్సివ్ కేర్ తప్పనిసరి..
వైరస్ సోకిన ప్రతి 2,381 చిన్నారుల్లో ఒకరికి ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరమవుతోందని తేల్చారు. అమెరికాలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 6 మధ్య 74 మంది చిన్నారులు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ విభాగాల్లో(పీఐసీయూ) చేరారు. దీన్నిబట్టి ఆ సమయంలో అమెరికాలో 1,76,190 మంది పిల్లలు ఈ వైరస్ బారినపడి ఉండొచ్చని పరిశోధకులు విశ్లేషించారు. పీఐసీయూ వ్యవస్థలు అందించిన సమాచారం ప్రకారం రెండేళ్ల లోపు చిన్నారులు 30 శాతం మంది, 2-11 ఏళ్ల మధ్య వారు 24 శాతం మంది, 12-17 ఏళ్ల వయసు చిన్నారులు 46 శాతం మంది కొవిడ్ కారణంగా ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందారు.
14 రోజులు ఆసుపత్రిలోనే..
ఈ ఏడాది చివర్లోగా అమెరికాలో 25 శాతం మంది ఈ ఇన్‌ఫెక్షన్ బారినపడతారనుకుంటే 50 వేల మంది చిన్నారులు ఈ వైరస్‌తో తీవ్ర అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని, వారిని ఆసుపత్రికి తరలించాల్సి వస్తుందని పరిశోధకులు తెలిపారు. వీరిలో 5400 మంది తీవ్ర అస్వస్థులవుతారని, వారికి మెకానికల్ వెంటిలేషన్ అవసరమవుతుందని చెప్పారు. చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన సగటు సమయం 14 రోజులుగా ఉందన్నారు.
ఇదీ చదవండి: మారుతున్న జీవనశైలితో సామాజిక చైతన్యం స్థిరపడేనా?