ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మందికిపైగా సోకిన కరోనా మహమ్మారి.. జంతువుల్లోనూ వ్యాప్తి చెందుతోంది. పిల్లులు కరోనా బారిన పడుతాయని, వాటిలో ఒకదాని నుంచి మరొకదానికి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అయితే.. పిల్లుల నుంచి మనుషులకు ఈ మహమ్మారి సోకుతుందనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదన్నారు పరిశోధకులు.
అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనం న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైంది.
ఆరు రోజుల్లోనే అన్నింటికి..
కరోనా సోకిన వ్యక్తి వద్ద ఉన్న మూడు పిల్లులను ప్రయోగశాలలో పర్యవేక్షించారు పరిశోధకులు. నాసికా రంధ్రాన్ని శుభ్రం చేసిన క్రమంలో రెండు పిల్లుల్లో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. కేవలం మూడు రోజుల్లోనే మూడింటిలో వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలిపారు.
ఒకరోజు తర్వాత మూడు పిల్లులు ఉన్న ప్రతి బోనులో మరొక పిల్లిని ఉంచారు. అయితే.. కొత్తగా చేర్చిన వాటికి వెంటనే వైరస్ సోకలేదని గుర్తించారు. ప్రతిరోజు ఆరు పిల్లుల్లో నాసికా రంధ్రం, మలం శుభ్రం చేసి వాటిలో వైరస్ ఉనికిని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. కేవలం రెండు రోజుల్లోనే ఇంతకు ముందు వైరస్‌కు గురికాని పిల్లులు సైతం వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. ఆరు రోజుల్లో అక్కడ ఉన్న మొత్తం పిల్లులు వైరస్ బారిన పడినట్లు తెలిపారు.
నాసికా రంద్రాల ద్వారానే..
మలంలో వైరస్ కనిపించలేదని తెలిపారు పరిశోధకులు. ప్రతి పిల్లిలో ముక్కు రంధ్రాల ద్వారానే వైరస్ సంక్రమించినట్లు వెల్లడించారు. పిల్లుల్లో ఈ వైరస్ ప్రాణాంతకం కాదని, ఏ ఒక్క పిల్లి కూడా అనారోగ్యానికి గురికాలేదని తెలిపారు. చివరికి.. అన్ని పిల్లులు వైరస్ నుంచి కోలుకున్నాయని వెల్లడించారు.
"వైరస్ సోకిన పిల్లుల్లో లక్షణాలు కనిపించకపోవటాన్ని గుర్తించటం మా పరిశోధనలో ముఖ్యమైన విషయం. కరోనా సోకిన మనుషులు, ఇతర పిల్లులతో కలిసిన సందర్భంలో పిల్లులకు వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు తమ పిల్లలు, భార్యకు వైరస్ సోకుతుందని ఆందోళన చెందుతున్నట్లే.. పెంపుడు జంతువులకు కూడా ఈ మహమ్మారి సోకే ప్రమాదంపై ఆందోళన పడాల్సిన అవసరం ఉంది."
- యోషిహిరో కవోకా, అధ్యయనం సహ రచయిత, విస్కాన్సిన్ మాడిసన్ విశ్వవిద్యాలయం.
జంతువులకు వైరస్ సోకే ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. అయితే.. పిల్లుల నుంచి మనుషులకు వైరస్ సోకుతుందనేందుకు ఎంలాటి ఆధారం లేదని స్పష్టం చేశారు. అమెరికాలోని బ్రోంజ్ జూలో పెద్ద సంఖ్యలో పిల్లులకు వైరస్ సోకటాన్ని గుర్తుచేశారు. జంతు ప్రేమికులు జాగ్రత్తలు పాటించాలని.. ఎప్పటికప్పుడు పశువైద్యుల సలహాలు తీసుకోవాలని కోరారు.