జనవరి 20న అగ్రరాజ్య తదుపరి అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు డెమొక్రాటిక్ నేత జో బైడెన్. ఇప్పటికే.. కరోనా మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమంలో భారీ మార్పులు చేశారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం సందర్భంగా.. క్యాపిటల్ భవనాన్ని ముట్టడించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన ప్రయత్నంతో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమ భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
ట్రంప్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగి.. క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకొచ్చిన ప్రదేశానికి దగ్గరగా ఉన్న వెస్ట్ ఫ్రంట్ కార్యాలయంలోనే బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ దాడి జరిగినప్పటికీ.. ఏర్పాట్లు ముందుకు సాగుతాయని తెలిపారు నిర్వహణ బాధ్యత కలిగిన కాంగ్రెస్ నాయకులు.
" నిన్నటి రోజు దేశానికి బాధాకరమైన, చీకటి రోజు. క్యాపిటల్‌పై దారుణమైన దాడి మమ్మల్ని ఆపదు. ప్రమాణ స్వీకార దేశ సంప్రదాయం.. శాంతి, గందరగోళం, ప్రతికూల సమయాల్లో జరుగుతోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ప్రమాణ స్వీకారం విజయవంతంగా పూర్తి చేస్తాం. బుధవారం జరిగిన ఘటనలతో భద్రతా బలగాలు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. "
- అమి క్లోబుచర్, మిన్నెసోటా సెనేటర్
6వేల మంది బలగాలు..
ప్రమాణ స్వీకారోత్సవానికి క్యాపిటల్ పోలీసులతో పాటు వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూయార్క్, న్యూజెర్సీ, డెలావర్, మారిల్యాండ్ రాష్ట్రాల నేషనల్ గార్డ్స్ విభాగం నుంచి సుమారు 6,200 మందిని మోహరించనున్నారు. మరో 30 రోజుల పాటు వాషింగ్టన్లోనే అదనపు బలగాలు నిఘా వేయనున్నాయి. ప్రమాణ స్వీకారం రోజున అన్ని ప్రధాన రహదారులను మూసివేయనున్నారు. ఎక్కేందుకు వీలు లేకుండా భారీ, బ్లాక్ మెటల్ కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఆందోళనలు చెలరేగిన క్రమంలో వినియోగించిన బారికేడ్లు, ఇతర సామగ్రిని వినియోగించనున్నారు.
ఇదీ చూడండి: బైడెన్ ప్రమాణ స్వీకారానికి నేను రాను: ట్రంప్