అమెరికా పార్లమెంట్ భవనం క్యాపిటల్ హిల్ వద్ద ఉద్రిక్తతలు జరిగిన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ మద్దతుదారులు ఆందోళనలకు దిగుతారని హెచ్చరికలు అందినా.. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ రోజుల్లో ఉండే స్థాయిలోనే భద్రతా సిబ్బంది ఉండటం, క్షణాల వ్యవధిలోనే నిరసనకారులకు పోలీసులు లొంగిపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: ట్రంప్ వర్గం రచ్చ- చరిత్రలో మాయని మచ్చ!
క్యాపిటల్ హిల్ వద్ద పహారా కాసే సిబ్బందిలో కొంతమంది వద్ద నిరసనకారులను నియంత్రించే పరికరాలు ఉన్నాయి. కానీ, ఆందోళన హద్దు మీరినప్పుడు ఉపయోగించే ఆయుధాలు లేవు. మరోవైపు, క్యాపిటల్ భవనంలోకి అల్లరి మూకలు ప్రవేశించినప్పుడు.. బలగాలను ఉపయోగించవద్దని ఓ పోలీస్ లెఫ్టినెంట్ జారీ చేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. పెద్ద ఎత్తున నిరసనకారులు లోపలకు ప్రవేశిస్తున్నా.. ఆయుధాలు ఉపయోగించకపోవడంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇదీ చదవండి: అది.. ట్రంప్ చేసిన ఉగ్రదాడి!
ఈ నేపథ్యంలో పోలీసుల ప్రవర్తనపై చట్టసభ్యుల నుంచి తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరసనకారులు పెచ్చు మీరినా.. పోలీసులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారని రిపబ్లికన్ చట్టసభ్యురాలు మాక్సైన్ వాటర్స్ పేర్కొన్నారు. భద్రతాపరమైన విషయాలపై డిసెంబర్ 28న జరిగిన హౌస్ డెమొక్రాట్ల సమావేశంలోనే ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు, ఈ ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) సైతం విచారణ ముమ్మరం చేసింది. కొంతమంది నిరసనకారులు ప్లాస్టిక్ సంకెళ్లు చేతిలో పట్టుకొని కనిపించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ సభ్యులను కిడ్నాప్ చేయాలని యత్నించారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు 90 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
నేరస్థుల పనే
క్యాపిటల్ నిరసనల్లో పాల్గొన్నవారిలో కరుడుగట్టిన నేరస్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టులు, ఓటర్ రిజిస్ట్రేషన్లు, కోర్టు పత్రాలు, ఇతర రికార్డులను పరిశీలించిన అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ).. నిరసనకారుల్లో 120 మంది క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇటీవలే జైలు నుంచి విడుదలైన వారు కూడా ఇందులో ఉన్నారని స్పష్టం చేసింది.
నిరసనకారుల్లో వామపక్ష అతివాదులైన 'అంటిఫా' హస్తం ఉందని రిపబ్లికన్ నేత మాట్ గేట్స్ చేసిన ఆరోపణలను ఏపీ తప్పుబట్టింది. ట్రంప్ మద్దతుదారులే ఆందోళనలకు ఆజ్యం పోశారని పేర్కొంది. వారిలో చాలా వరకు 'రైట్-వింగ్ మిలిటెంట్లు', రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ మద్దతుదారులు, పార్టీ డోనర్లు, శ్వేతజాతి ఆధిపత్యవాదులే ఉన్నారని స్పష్టం చేసింది. చాలా వరకు నిరసనకారులు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు చేశారని పేర్కొంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ట్రంప్‌కు మద్దతుగా ట్వీట్లు చేశారని తెలిపింది. డెమొక్రాట్లతో పాటు ట్రంప్‌కు విధేయత చూపని రిపబ్లికన్ నేతలపైనా దాడులు చేసేందుకు వెనకాడమని బెదిరించినట్లు వెల్లడించింది. క్యాపిటల్‌లో హింసాకాండ తర్వాత ఇందుకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారని, మరికొందరు లైవ్ స్ట్రీమింగ్ సైతం చేశారని స్పష్టం చేసింది. తాము చేసిన పని గురించి నిరసనకారులు గొప్పగా చెప్పుకున్నారని పేర్కొంది.
ఇవీ చదవండి: