కరోనా మహమ్మారి బారిన పడిన ప్రముఖుల జాబితాలో బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బాల్సోనారో చేరారు. వైరస్ నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
బ్రెజిల్లో కరోనా ఉద్ధృతంగా ఉన్నప్పటికీ మాస్క్ ధరించేందుకు ఇష్టపడలేదు బాల్సోనారో. గతంలో తాను క్రీడాకారుడినని.. అదే తనను వైరస్ బారిన పడకుండా రక్షిస్తుందని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అనేక కార్యక్రమాలకు మాస్క్ లేకుండానే హాజరయ్యారు. అభిమానులకు కరచాలనాలు ఇచ్చారు. కలిసి తిరిగారు. చివరకు వైరస్ బారిన పడ్డారు.
కరోనా కారణంగా ప్రపంచంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన రెండో దేశం బ్రెజిల్. అయినప్పటికీ కరోనా వైరస్ కంటే దేశ ఆర్థిక వ్యవస్థే ముఖ్యమన్నారు బాల్సోనారో. దేశ జనాభాలో 70 శాతం మందిని కరోనా బారి నుంచి రక్షించలేమని నిర్మొహమాటంగా చెప్పారు. ఆర్థిక వ్యవస్థ ఆగిపోతే అంతకంటే ఎక్కువ ప్రమాదం అన్నారు. గత నెలలోనే పలు రాష్ట్రాలు, నగరాల్లో ఆర్థిక ఆంక్షలు ఎత్తివేశారు.