కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బ్రెజిల్ ప్రభుత్వం టీకాల అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. అయితే ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా సినోవాక్‌కు అనుమతివ్వడాన్ని అధ్యక్షుడు జాయిర్ బాల్సోనారో మిత్రపక్షాలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు రష్యా టీకా స్పుత్నిక్-వీ కి బ్రెజిల్ అనుమతి నిరాకరించింది.
సినోవాక్ సామర్థ్యంపై..
బ్రెజిల్లో కరోనా టీకాల అనుమతి వివాదాస్పదంగా మారింది. సావో పాలో గవర్నర్ జోనో డోరియా సినోవాక్ సమర్థతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇండోనేసియా, చైనా, బొలీవియాల్లో ఈ వ్యాక్సిన్‌కు షరతులతో కూడిన అనుమతులే వచ్చాయని గుర్తుచేశారు. ప్రపంచ ఆరోగ్య నిపుణులు సైతం దీని సామర్థ్యం 50శాతమేనని తేల్చారని తెలిపారు.
ముందు వారికే..
మరోవైపు ప్రాధాన్యం పరంగా టీకా పంపిణీ ప్రారంభమవుతుందని ఆరోగ్య మంత్రి ఎడ్వర్డ్ పజేల్లో ప్రకటించారు. మహమ్మారిపై పోరులో ముందుండి పనిచేసిన ఆరోగ్య నిపుణులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మొదట టీకా అందిస్తామన్నారు. బ్రెజిల్లో ప్రస్తుతం 6 మిలియన్ డోసుల సినోవాక్ వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉంది. అలాగే 2 మిలియన్ డోసుల ఆస్ట్రాజెనెకా టీకా త్వరలోనే బ్రెజిల్ చేరనుంది.
టీకాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. బ్రెజిల్ పౌరుల్లో చాలా మంది టీకా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇదీ చదవండి: తీవ్ర కొవిడ్ ముప్పు వారిని గుర్తించే రక్త పరీక్ష