ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కొవిడ్ మహమ్మారి విషయంలో ముందునుంచీ అలసత్వంగానే ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ఇప్పుడు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు చోటుచేసుకున్న రెండో దేశం బ్రెజిలే అయినప్పటికీ.. వ్యాక్సిన్‌పై ఇంకా విముఖత చూపిస్తూనే ఉన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేదే లేదంటున్న బొల్సొనారో.. అది తన హక్కు అని చెప్పారు.
తాజాగా ఓ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో బొల్సొనారో మాట్లాడుతూ.. 'నేను కొవిడ్ టీకా తీసుకోను. అది నా హక్కు' అని అన్నారు. అంతేగాక, బ్రెజిల్ వాసులకు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ సందర్భంగా మాస్క్‌ల సమర్థతపై కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మాస్క్ ధరిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని అన్నారు.
కాగా.. బొల్సొనారో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది అక్టోబరులో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలపై స్పందిస్తూ.. బ్రెజిల్ వాసులకు వ్యాక్సిన్ అవసరం లేదని, తన శునకానికి మాత్రమే టీకా అవసరం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొదట్నుంచీ బొల్సొనారో కొవిడ్ వైరస్‌ను తక్కువ చేసి చూస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఆయన కూడా వైరస్ బారిన పడినప్పటికీ.. తమ దేశంలో కొవిడ్ అంత తీవ్రంగా లేదని చెప్పడం గమనార్హం.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. తొలినాళ్లలో బ్రెజిల్‌లో వైరస్ ప్రభావం అంతగా లేదు. అయితే బొల్సొనారో నిర్లక్ష్యంతో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన సమయాన్ని వృథా చేయడం వల్ల అక్కడ వైరస్ విజృంభించింది. చివరకు అమెజాన్ అడవుల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా పాకింది. అయినా అధ్యక్షుడు తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఆయనకు కరోనా సోకిన విషయాన్ని ప్రకటించడంలోనూ బొల్సొనారో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. విలేకర్లను పిలిచి కొంచెం దూరం జరిగి తన ఫేస్ మాస్క్ తీసి కరోనా సోకిన విషయాన్ని వెల్లడించారు. దీంతో విలేకర్లు హడలిపోయారు.