కరోనా వైరస్ నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇప్పటికే అపవాదు మూటగట్టుకున్న బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో.. మరోసారి చిక్కుల్లో పడ్డారు. తన కుటుంబ సభ్యులను క్రిమినల్ కేసుల నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలకు బలంచేకూర్చేలా ఓ వీడియో బహిర్గతమైంది. సుప్రీంకోర్టు విచారణలో భాగంగా ఇది బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
క్రిమినల్ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న కుమారుడిని రక్షించుకునేందుకు బొల్సొనారో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బ్రెజిల్ మాజీ న్యాయశాఖ మంత్రి సెర్జియో మోరో. పోలీసు ఉన్నతాధికారులను మార్చేందుకు యత్నించారని తెలిపారు. అందుకే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి.. గతనెలలో రాజీనామా చేశారు.ఈ విషయంపై బ్రెజిల్ సుప్రీంకోర్టు దర్యాప్తు చేపట్టింది.
ప్రస్తుతం విడుదల చేసిన వీడియోలో తన కుటుంబ సభ్యులను కాపాడుకోలేకపోతున్నానని కేబినెట్ మీటింగ్‌లో బొల్సొనారో అసహనం వ్యక్తం చేసిన దృశ్యాలున్నాయి. అవసరమైతే మంత్రులను, పోలీసు శాఖలో అధికాలను మార్చయినా తన కుమారుడిని రక్షించుకోవాలనే తాపత్రయం వ్యక్తం చేసినట్లు అందులో తెలుస్తోంది.
ఆ తర్వాత తనకు సహకరించడం లేదని ఫెడరల్ పోలీస్ డైరెక్టర్ జనరల్‌ను పదవి నుంచి తప్పించారు బొల్సొనారో. తనను సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని మాజీ న్యాయశాఖ మంత్రి మోరో రాజీనామా చేశారు. అయితే ఈ విషయం చర్చనీయాంశం అయిన తర్వాత వెంటనే స్పందించారు దేశాధ్యక్షుడు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది గురించే వీడియోలో మాట్లాడినట్లు సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
బొల్సొనారో ఇద్దరు కుమారుల్లో ఒకరు క్రిమినల్ కేసులో, మరొకరు వేరే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కరోనా కట్టడిలో విఫలమయ్యారని బొల్సొనారోపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిజాయతీపరుడని ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న మోరో రాజీనామా చేశాక పరిస్థితి ఇంకా మారిపోయింది.
కరోనా కేసుల్లో రష్యాను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది బ్రెజిల్. ఇప్పటికే 20వేల మంది వైరస్‌కు బలయ్యారు. పరిస్థితి ఇలాగే ఉంటే అమెరికాను కూడా దాటేస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.