Brazil Floods 2022: ఊహకందని విపత్తుతో బ్రెజిల్ వాసులు చిగురుటాకులా వణికిపోయారు. రియో-డి-జెనిరియో రాష్ట్రంలోని పర్వత ప్రాంతమైన పెట్రో పోలిస్ నగరంలో తొమ్మిది దశాబ్దాల తర్వాత భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా కొండలపై నుంచి బురద, రాళ్లు కొట్టుకొచ్చి జనవాసాలపై పడ్డాయి. ప్రమాద ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 117కు చేరింది. మరో 116 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
బురదలో చాలా మంది కూరుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. శిథిలాలను తొలగిస్తున్నా కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి.
కొట్టుకుపోయిన కార్లు, ఇళ్లు..
భారీ వరదల్లో కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. వరదలో రెండు బస్సులు కొట్టుకుపోగా అందులోని ప్రయాణికులు కిటికీల నుంచి అతి కష్టం మీద బయటపడ్డారు. మరి కొంతమంది బస్సులతో పాటే కొట్టుకుపోయారు. వరద నీరు, బురద పోటెత్తడం వల్ల అనేక ఇళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వరదల ధాటికి దెబ్బతిన్న స్మశానవాటికలోనే మరణించినా వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గల్లంతైన వారి వివరాలను కుటుంబ సభ్యుల నుంచి సేకరిస్తున్న పోలీసులు వాటి ద్వారా మరణించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గల్లంతైన వారికోసం గాలింపు..
గల్లంతైన వారికోసం సైనికులు సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. మళ్లీ భారీ వర్షం కురుస్తుందనే హెచ్చరికలతో స్థానికులు భయాందోళనలకు గురవతున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే వారు వెంటనే ఖాళీ చేయించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే 180 మందికిపైగా ఖాళీ చేయించగా వారు పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. వరదల వల్ల ఇప్పటికే 400 మంది నిరాశ్రయులయ్యారని, 24 మందిని సురక్షితంగా కాపాడగలిగామని అధికారులు తెలిపారు.
వరదలపై బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషాదానికి సంతాపంగా పెట్రోపోలిస్ నగరంలో మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు.
ఇదీ చూడండి: యుద్ధం వస్తే తగ్గేదేలే.. ఏకే-47 పట్టిన 79 ఏళ్ల బామ్మ