Brazil cliff collapses: అది అందమైన సరస్సు.. చుట్టూ ఎత్తయిన రాతి కొండలు.. వాటిపై పచ్చని చెట్లు.. పైనుంచి భారీగా జాలువారుతున్న జలధార.. ఇలాంటి ప్రకృతి రమణీయతను వీక్షించాలని ఎవరు మాత్రం అనుకోరూ? బ్రెజిల్‌లో ఈ ప్రకృతి సోయగాలను చూసేందుకు వెళ్లిన యాత్రికుల బోటుపై భారీ రాతి ఫలకం విరిగిపడి.. ఏడుగురు మరణించారు. ఆ యాత్రికుల వారాంతపు విహార యాత్ర.. విషాదయాత్రగా మిగిలింది.
మినాస్ గెరైస్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫర్నస్ సరస్సులో ఘోరం జరిగింది. సరస్సులో ప్రయాణిస్తూ.. ప్రకృతి సోయగాలకు మైమరచిపోతున్న పర్యటకుల బోటుపై పెద్ద రాతిపలక విరిగిపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు యాత్రికులు మరణించారు. 32 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మంది గల్లంతయ్యారు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
వారాంతం కావడంతో ఫర్నస్ సరస్సుకు పర్యటకులు భారీగా తరలివెళ్లారు. అంతా బోట్లలో తిరుగుతూ జలపాతం సమీపంలోకి వెళ్లారు. అంతే సరస్సులోని మూడు బోట్లపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏడుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. ఇటీవల ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. దాని వల్లే కొండచరియ విరిగి పడిందని అధికారులు తెలిపారు.
అధ్యక్షుడు దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం నౌకాదళం, హెలికాఫ్టర్లు, సహాయక దళాలను రంగంలోకి దింపారు.
ఇదీ చదవండి: ఒమిక్రాన్ వేళ.. అక్కడ ఐదేళ్లలోపు పిల్లల్లో భారీగా ఆసుపత్రి చేరికలు