ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 86 కార్లు మంటల్లో కాలిపోయాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. బేకర్స్ఫీల్డ్ ప్రాంతంలోని 'కార్ మాక్స్' కార్ల డీలర్‌షిప్‌కు చెందిన పార్కింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన కార్లకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి.
ఈ ఘటనలో 26 కార్లు పూర్తిగా కాలి బూడిదవగా మరో 60 వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఫలితంగా 2.1 మిలియన్ డాలర్ల నష్టం జరిగినట్లు అంచనా.
గడ్డే కాల్చేసింది...
99వ రాష్ట్ర రహదారి వెంట ఉన్న గడ్డికి అంటుకున్న నిప్పు కార్ల వరకు పాకిందని సమాచారం. ఒక పెద్ద లారీ భారీ వస్తువును లాగడం కారణంగా గొలుసుల్లో ఉత్పన్నమైన నిప్పు రవ్వలు గడ్డి కాలేందుకు కారణమని తెలుస్తోంది.
20 ఎకరాల మేర విస్తరించిన మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
ఇదీ చూడండి: జీ20కి ట్రంప్: ఉద్రిక్తతలకు తెరపై ఆశలు