బోయింగ్ 737 మాక్స్ విమాన ప్రమాదాలపై విచారణ జరిపిన అమెరికా జస్టిస్ కోర్టు.. బోయింగ్ సంస్థకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో జరిగిన రెండు విమాన ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ 2.5 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. బాధిత కుటుంబాలకు, ఎయిర్‌లైన్ కస్టమర్లకు పరిహారం చెల్లిస్తామని బోయింగ్ సంస్థ తెలిపింది. విమానాల భద్రతా ప్రమాణాలపై అధికారులు తప్పుడు సమాచారాన్ని అందించారని న్యాయవాదులు తెలిపారు. బోయింగ్ అధికారులు మోసం చేసి లాభాలను ఆర్జించాలని చూశారని జస్టిస్ డిపార్ట్మెంట్ అటార్నీ జనరల్ డేవిడ్ బర్నస్ తెలిపారు. కోర్టు ఆదేశం ప్రకారం.. 243.5 మిలియన్ డాలర్ల జరిమానా కట్టనుంది బోయింగ్ సంస్థ. 1.77 బిలియన్ డాలర్లను పరిహారం కింద ఎయిర్‌లైన్స్‌కు చెల్లించనుంది. దీంతోపాటు 500 మిలియన్ డాలర్లను విమాన ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబాలకు చెల్లించనుంది.
ఏం జరిగింది ?
2019లో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం అడీస్ అబాబా వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 157 మంది మరణించారు. గతంలో ఇండోనేసియాలోనూ ఇదే శ్రేణి విమానం కూలి 180 మంది మరణించారు. భద్రతాలోపం వల్లనే ఈ ప్రమాదాలు జరిగినట్లు నిపుణులు తేల్చారు. దీంతో బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలను భారత్ సహా చాలా దేశాలు నిషేధించాయి.
ఇదీ చదవండి : బోయింగ్ ఇంజిన్లు అత్యవసరంగా చెక్ చేయాలని ఆదేశాలు