ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటివరకు కచ్చితమైన చికిత్స లేదు. కేవలం లక్షణాలకనుగుణంగా చికిత్స మాత్రమే జరుగుతోంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్, ఔషధంపై విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే, కరోనా వైరస్ సోకి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యేవారిని ముందుగానే గుర్తించవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కరోనా సోకిన రోగుల రక్తాన్ని పరీక్షించడం ద్వారా వెంటిలేటర్ అవసరమయ్యే అంశాన్ని ముందే పసిగట్టవచ్చని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం వెల్లడించింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రోగుల్లో కనిపించే 'సైటోకైన్ స్ట్రామ్' ఉపద్రవాన్ని ముందుగానే గుర్తించి, దానికి అనుగుణంగా చికిత్స చేసే వీలుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రక్తంలో నిర్ధిష్ట సైటోకైన్‌ల స్థాయిని గుర్తించడం ద్వారా వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయవచ్చని పరిశోధనలో పాల్గొన్న మయూరేష్ అభ్యాంకర్‌తోపాటు ఇతర శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, మధుమేహం ఉన్నవారిలో కరోనా వైరస్ ఎందుకు ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకునేందుకు ఈ తాజా పరిశోధన దోహదపడుతుందని అంటున్నారు.
కరోనా సోకిన రోగులపట్ల వైద్యులు నిశిత పర్యవేక్షణ చేయడం ద్వారా వారిని ప్రాణాపాయం నుంచి కాపాడటంలో ఈ పరిశోధన దోహదంచేస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, సైటోకైన్లను గుర్తించడం ద్వారా వైద్యులు మెరుగైన చికిత్సా విధానాన్ని అవలంభించే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో కరోనా సోకి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 57మందిపై పరిశోధనలు జరిపారు. కరోనావైరస్ నిర్ధారణ అయిన 48గంటల్లోపే రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షించారు. వీటి ఫలితాలను వెంటిలేటర్ అవసరంలేని రోగులతో పోల్చి చూసిన అనంతరం ఫలితాలను బేరీజు వేశారు. అయితే, కరోనా తీవ్రత పెరగడానికి సైటోకైన్‌లు ఎలా కారణమౌతున్నదో తెలసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
సాధారణంగా మధుమేహంతో బాధపడేవారికి ఏదైనా ఫ్లూ వచ్చినప్పుడు సైటోకైన్ ప్రోటీన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇక వీరికి కరోనా సోకితే ఈ పెరుగుదల స్థాయి మరింత ఎక్కవౌతుంది. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థతో తీవ్ర ప్రతిచర్యకు గురౌతాయి. 'సైటోకైన్ స్ట్రామ్'గా పిలిచే ఈ ప్రభావంతో ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి ప్రాణాపాయానికి దారితీస్తున్నట్లు ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు.