కరోనా సోకకుండా ప్రభుత్వాధికారులు, ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు వేడి నీళ్లు తాగుతూ, కొవిడ్ నిబంధనలు పాటిస్తుంటే.. ప్రభుత్వ యంత్రాంగం అనుమానిత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ కరోనాను సంహరించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ కరోనా వైరస్‌ను చంపుతుంది కదా అని నార్త్ టెక్సాస్‌లో కొందరు బ్లీచింగ్ పౌడర్ కలిపిన ద్రవాన్ని తాగుతున్నారట.
ఎవరికైనా కరోనా నిర్ధరణ అయితే వారి ఇంట్లో.. పరిసర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్న విషయం తెలిసిందే. అయితే నార్త్ టెక్సాస్‌లో కొందరు బ్లీచింగ్ పౌడర్ ద్రవం తాగడం వల్ల శరీరంలోకి ప్రవేశించిన కరోనా కూడా నశిస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారట.
అక్కడి అమాయక ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మి బ్లీచింగ్ పౌడర్ కలిపిన ద్రవం తాగుతున్నారు. అనంతరం అస్వస్థతకు గురవుతున్నారు. ఇలా ఆగస్టు నెలలో ఇప్పటి వరకు దాదాపు 50 మంది బ్లీచింగ్ పౌడర్ కలిపిన ద్రవం తాగి అస్వస్థతకు గురయ్యారట. దీంతో ఇలాంటి తప్పుడు సమాచారాలను నమ్మొద్దంటూ టెక్సాస్ పాయిజన్ సెంటర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. బ్లీచింగ్ పౌడర్ ద్రవం తాగితే వాంతులు, విరేచనాలు, రక్తప్రసరణలో సమస్యలు, కాలేయం దెబ్బతినడం వంటివి జరుగుతాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) వెల్లడించిందని తెలిపింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో మత్తు కోసం పలువురు కరోనా కట్టడి కోసం ఉపయోగించే శానిటైజర్లు తాగారు. శానిటైజర్ తాగి 13 మందికిపైగా మృతి చెందగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. శానిటైజర్ తాగుతున్న మరికొందరిని పోలీసులు గుర్తించి వారిని కూడా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: 'జాకబ్' నిరసనల్లో కాల్పులు- ఇద్దరు మృతి