ధవళ వర్ణంలో ఠీవిగా కాంతులీనే హిమశైలం మెల్లగా నల్లబారుతోంది. మానవ చర్యల వల్ల వెలువడుతున్న మసి రేణువులతో హిమాలయ పర్వతాల్లోని హిమానీనదాలు, మంచు వేగంగా తరిగిపోతున్నాయని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఫలితంగా ఉష్ణోగ్రతలు, వర్షపాత తీరుతెన్నులూ మారిపోతున్నాయని పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఒక అధ్యయన నివేదికను వెలువరించింది. "అధిక ఉష్ణోగ్రతలకు తోడు మసి రేణువులు ఎక్కువగా పేరుకోవడం వల్ల హిమాలయాల్లోని హిమానీనదాలు, మంచు వేగంగా కరిగిపోతున్నాయి. దక్షిణాసియా లోపల, వెలుపల జరుగుతున్న మానవ కార్యకలాపాల వల్ల ఈ మసి రేణువులు వెలువడుతున్నాయి. వాతావరణ మార్పులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్న అనేక రకాల ఏరోసాల్ రేణువుల్లో ఇవి కూడా ఉన్నాయి" అని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు హార్ట్‌విగ్ స్కాఫర్ చెప్పారు.
అలా కూలిపోవడం విపత్కర పరిస్థితికి నిదర్శనం
మసి రేణువుల విడుదలను తగ్గించేందుకు దక్షిణాసియా దేశాలు అనుసరిస్తున్న విధానాలు.. హిమాలయ, కారకోరం, హిందుకుష్ పర్వతశ్రేణుల్లో హిమానీనదాల ఆవిర్భావం, కరుగుదలపై ఎంత మేర ప్రభావం చూపిస్తున్నాయన్నది కూడా అధ్యయనం పరిశీలించింది. హిమానీనదాలు తగ్గిపోవడం వల్ల దిగువన నదీపరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యతపై పడే ప్రభావాన్నీ విశ్లేషించింది. ఇటీవల హిమానీనదాలు కూలిపోయి, అకస్మాత్తుగా వరదలు రావడం.. వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న విపత్కర పరిస్థితులకు నిదర్శనమని స్కాఫర్ చెప్పారు. "హిమానీ నదాలు తరిగిపోయేకొద్దీ.. దిగువ ప్రాంతాల్లో నీటి లభ్యత తీరుతెన్నుల్లో మార్పులు వస్తాయి. దీనివల్ల పెద్ద సంఖ్యలో ప్రజల జీవితాలు, జీవనోపాధిపై ప్రభావం పడుతుంది. అందువల్ల మసి రేణువుల విడుదలను తగ్గించడం ద్వారా ఈ తరుగుదలను మనం నెమ్మదింపచేయవచ్చు. ఈ విషయంలో ప్రాంతీయ సహకారం అవసరం. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యపరంగా అనేక లాభాలు ఒనగూరుతాయి" అని వివరించారు.
జల విద్యుత్తు ప్రధానం
దక్షిణాసియాలో పర్యావరణానికి హాని కలిగించని శుద్ధ ఇంధన వనరుల్లో జలవిద్యుత్ ప్రధానమైందని ప్రపంచ బ్యాంకు ఈ నివేదికలో పేర్కొంది. దీనికి సంబంధించిన వనరులపై దక్షిణాసియా దేశాలు కలిసి పనిచేయాలని కోరింది. హిమానీనదాల కరుగుదల వల్ల వెలువడే నీటి ప్రవాహంలో అస్థిరత, వర్షపాత తీరుతెన్నుల్లో మార్పులు.. దీర్ఘకాలంలో నీటి లభ్యతను స్థిరీకరించాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నాయని తెలిపింది. జలవిద్యుత్‌ను మరింత ఆచరణయోగ్యంగా మలిచి, కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఇది అవసరమని పేర్కొంది. హిమాలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు, పరిశోధకుల మధ్య సమన్వయం, సహకారం అవసరమని సూచించింది.
ఇదీ చదవండి : 'వైరస్ గురించి నేను ముందే చెప్పా కదా'